విశాఖ పరిపాలనా రాజధానిపై ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దసరా నాటికి సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. విశాఖ ప్రజల కల కూడా నెరవేరబోతుందని గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
విశాఖ పరిపాలనా రాజధానిపై ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కోలా గురువులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుడివాడ మీడియాతో మాట్లాడుతూ.. ఈ దసరాకు విశాఖ ప్రజల కోరిక నెరనుందన్నారు. పార్టీ నాయకత్వం కోరుకున్న శుభ పరిణామం జరుగుతుందని అమర్‌నాథ్ తెలిపారు. దసరా పండుగ నాడు మన ప్రాంతానికి బ్రహ్మాండమైన కానుక వస్తోందని మంత్రి పేర్కొన్నారు.
సీఎం జగన్ ఇక్కడ రూ.1000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యకలాపాలకు నిన్ననే శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరగదని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురిపై వేటు వేసిన ధైర్యం జగన్‌దని అమర్‌నాథ్ పేర్కొన్నారు. దీంతో దసరా నాటికి సీఎం విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తారని మంత్రి సంకేతాలిచ్చినట్లయ్యింది.
ALso Read: పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తా.. ఈ పేర్లు పరిశీలిస్తున్నా: మంత్రి అంబటి
ఇదే సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగదన్నారు. చట్టసభలో కూర్చోబెడతాని జగన్ చెప్పినట్లే చేశారని.. కానీ చంద్రబాబు కుట్రలతో గురువులు ఓడిపోయారని సుబ్బారెడ్డి ఆరోపించారు. మత్స్యకారుడిని రాజ్యసభకు పంపిన చరిత్ర జగన్‌దని.. బీసీలకు ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఈసారి కోలా గురువులను జగన్ కచ్చితంగా చట్టసభలో కూర్చోబెడతారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
