జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్రపై మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్.  మొన్న పార్ట్ 1, ఇప్పుడు పార్ట్ 2.. రాజకీయాలంటే ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ అనుకుంటున్నారా అని గుడివాడ మండిపడ్డారు. 

ఇవాళ్టీ నుంచి జరగనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్రపై మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ సినిమాల్లో హీరో అని, రాజకీయాల్లో మాత్రం సైడ్ హీరో అంటూ సెటైర్లు వేశారు. వారాహి యాత్ర ఎందుకు ..? ఎన్నికల ముందే విజయ యాత్ర చేస్తారా అంటూ దుయ్యబట్టారు. మొన్న పార్ట్ 1, ఇప్పుడు పార్ట్ 2.. రాజకీయాలంటే ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ అనుకుంటున్నారా అని గుడివాడ మండిపడ్డారు. వారం రోజులు తిరిగాడో లేదో జ్వరం వచ్చేసిందని.. నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని ఇప్పుడు పార్ట్ 2 యాత్రకు పవన్ వస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. 

మిమ్మల్ని హీరోని చేయాలని జనసేన నేతలు అనుకుంటుంటే.. మరో హీరో పక్కన నిల్చొంటానని అంటున్నారంటూ అమర్‌నాథ్ సెటైర్లు వేశారు. అయితే అవతలి పక్కనున్న వ్యక్తి హీరో కాదని.. విలన్ అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారని మంత్రి నిలదీశారు. 175 సీట్లలో పోటీ చేస్తే.. ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు అవకాశం ఇస్తారని అమర్‌నాథ్ హితవు పలికారు.

చంద్రబాబును భుజాన వేసుకుని తిరగడానికి పార్టీ దేనికి అని మంత్రి ప్రశ్నించారు. 175 సీట్లను ఎలా కొట్టాలి అని మేం చూస్తుంటే.. చంద్రబాబు, పవన్ మాత్రం అభ్యర్ధులను ఎలా పెట్టాలా అని ఆలోచిస్తున్నారని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. 175 సీట్లలో పోటీ చేసేందుకు కూడా వాళ్లకు అభ్యర్ధులు లేరని.. ఎన్ని యాత్రలు చేసినా 2019 నాటి ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు. 

ALso Read: ఆ తర్వాతే నిర్ణయం..: ఎన్నికల్లో పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. జనసేన వారాహి విజయ యాత్ర రెండో దశ జులై 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇన్చార్జులు, పరిశీలకులతో పవన్ కల్యాణ్ శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నికల్లో పొత్తుల గురించి ఆలోచించేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బలంగా పనిచేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని.. పార్టీ శ్రేణులు ఇందుకు అనుగుణంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.