తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పలు ప్రశ్నలు సంధించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి అమర్నాథ్ సోమవారం విశాఖలో మీడియాతో మాట్లడుతూ.. చంద్రబాబుకు ఐటీ షోకాజ్ నోటీసులపై రెండు రోజులు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు సమాధానం ఇవ్వడం లేదని చెప్పారు. పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టం అవుతుందని అన్నారు.
చంద్రబాబు నీతులు చెబుతుంటారని.. మరి ఆయనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి కదా అని మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం చీకటి చరిత్ర అని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయం అంతా కుట్రలు, కుతంత్రాలేనని విమర్శించారు. చంద్రబాబు ఎదుగుదల, ఆస్తుల గురించి ప్రజలకు తెలుసునని అన్నారు.
చంద్రబాబు వెన్నుపోటు ద్వారానే రాజకీయంగా ఎదిగారని విమర్శించారు. చంద్రబాబుపై ఉన్న కుంభ కోణాలు.. దేశంలో ఏ రాజకీయ నాయకుడిపైన లేవని ఆరోపించారు. ఏలేరుస్టాంపుల కుంభకోణంలో చంద్రబాబు ప్రయేయం తెలియంది కాదని అన్నారు. ఐటీ నోటీసులు ఇస్తే చంద్రబాబు తేలు కుట్టిన దొంగల ఉన్నారని విమర్శించారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. అన్నాహజారే వారసుడినంటూ చెప్పుకునే చంద్రబాబు.. ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. రూ. 118 కోట్ల లంచాలు తీసుకున్నారని ఐటీ చెబుతుంటే.. సంబంధం లేని లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తీగ బయటకు వచ్చింది.. ఇంకా డొంక కదలాల్సి ఉందన్నారు.
2020 నుంచి నాలుగు నోటీసులు ఇచ్చారని.. సంబంధం లేదని చంద్రబాబు వివరణ ఇచ్చారని.. ఆయన వారి జురిడిక్షన్‌లో లేరని అంటారని సెటైర్లు వేశారు. అమరావతిలో దొంగతనం చేస్తే కనకదుర్గ వారధి దగ్గర ఎందుకు పట్టుకున్నారని పోలీసులను ప్రశ్నించినట్టుగా చంద్రబాబు తీరు ఉందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎంవీపీ అనే వ్యక్తి కంపెనీ నుంచి అవినీతి సొమ్ముకు మీడియేటర్‌గా పనిచేసినట్టుగా తేలిందని అన్నారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని విమర్శించారు. అమరావతి పేరుతో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
