వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. కరోనా సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి పనిచేస్తే పవన్, చంద్రబాబులు హైదరాబాద్‌లో ముసుగుతన్ని పడుకున్నారని దుయ్యబట్టారు. 

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పరువు నష్టం దావా వేసే వరకు విషయం వెళ్లింది. అంతేకాదు.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు సైతం పవన్‌పై మండిపడుతున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

‘‘ ప్యాకేజీ స్టార్.. పవన్ కల్యాణ్ నువ్వు చెప్పిన వాలంటీర్లు గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌జ‌లకు పింఛ‌న్ అందిస్తున్నారు. వారికి అవ‌స‌ర‌మైన ప్ర‌భుత్వ స‌ర్టిఫికెట్లు అందిస్తున్నారు. క‌రోనా సమ‌యంలో ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌హించారు. వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు సమాచారం అందించారు. అప్పుడు నువ్వు, నీ గురువు చంద్రబాబు నాయుడు హైద్రాబాద్‌లో ముసుగుత‌న్ని ప‌డుకున్నారు. 

ఆరోజు తెలియ‌లేదా వాలంటీర్ల‌కు బాస్ ఎవ‌రు, ఎవరు చెప్తే వారు ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్నారు, వారు ఏ మంత్రిత్వ శాఖ కింద‌కు వస్తారు అని? .. ఇప్పుడు వారిపై నింద‌లు వేయ‌డానికి త‌యార‌య్యావు. వాలంటీర్లు చేసే మంచి ఏంటో వారి వ‌ల్ల ల‌బ్ధిపొందుతున్న ప్ర‌జ‌ల‌ను నేరుగా అడుగు తెలుస్తుంది. అంతే త‌ప్ప లారీ ఎక్కి ఊగిపోయి మాట్లాడితేనో.. ఇలా ట్వీట్లు పెడితేనో ఎలా తెలుస్తుంది ’’ అంటూ అమర్‌నాథ్ దుయ్యబట్టారు.

ALso Read: పబ్లిసిటీ కోసమే ఇలా , వాలంటీర్ల జోలికొస్తే ఊరుకునేది లేదు .. పవన్‌ కళ్యాణ్‌కు వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్

అంతకుముందు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే వాలంటీర్లపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని.. వాలంటీర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

సెప్టెంబర్‌లో జగన్ విశాఖలో పర్యటిస్తారని.. వైసీపీని నమ్ముకున్న అందరికీ జగన్ న్యాయం చేశారని సుబ్బారెడ్డి కొనియాడారు. ఎన్ని పార్టీలు, ఎందరు కలిసొచ్చినా ప్రజలు జగన్‌వైపే వుంటారని ఆయన జోస్యం చెప్పారు. జగన్‌ను గద్దె దింపాలంటే మూడు పార్టీలు ఏకం కావాల్సి వస్తోందని.. అంటే జగన్ అంత స్ట్రాంగ్ అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.