ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మేనమామ కారు చోరీకి గురైంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 78లో గౌతమ్ రెడ్డి మేనమామ ప్రభాకర్ రెడ్డి నివసిస్తున్నారు. కాగా... ఆయన బిజినెస్ చేసుకుంటూ జీవిస్తున్నారు.  ఇటీవల ఆయన తనకు సంబంధించిన ఫార్చ్యూనర్‌లో రోజంతా తిరిగి సాయంత్రం ఇంటి ఎదుట పార్కింగ్‌లో పెట్టి తాళాన్ని ఇంటి బయట కొక్కానికి వేస్తారు.

ఈ విషయాన్ని గమనించిన ఓ అగంతకుడు సోమవారం అర్ధరాత్రి కారును చోరీ చేసి తీసుకుపోయాడు. ఉదయం లేచి చూసేసరికి కారు కనిపించకపోవడంతో ప్రభాకర్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా వేములవాడ సమీపంలోని నాంపల్లి గుట్ట వద్ద ఓ ఇంటికి అడ్డంగా ఫార్చ్యూనర్‌ నిలిపి అగంతకుడు పారిపోయాడు.

మంగళవారం గమనించిన ఇంటి యజమాని కారు ఎవరిదని వాకబు చేశాడు. ఎవరూ స్పందించికపోవడంతో టయోటాకు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. టయోటా కంపెనీ నిర్వాహకులు కారు నెంబర్‌ ద్వారా ప్రభాకర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కారును స్వాధీనం చేసుకునేందుకు వేములవాడ బయలుదేరి వెళ్లారు.