Asianet News TeluguAsianet News Telugu

వాలంటీర్లను కొనసాగిస్తారా.. తొలగిస్తారా? క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.

Minister Dola Sri Bal Veeranjaneya Swamy Reassures Volunteers: NDA Commitment to Volunteer System Remains Unchanged GVR
Author
First Published Aug 5, 2024, 7:03 PM IST | Last Updated Aug 5, 2024, 7:24 PM IST

అమరావతి: గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడే ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు ప్రచారంలోకి వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ల భవిష్యత్‌ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ, మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాల విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.

వాలంటీర్లు తమ భవిష్యత్‌పట్ల ఎలాంటి భయాందోళనలకూ గురికావాల్సిన పని లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. భయాందోళనలకు గురిచేసే ఎలాంటి తప్పుడు కథనాలనూ వాలంటీర్లు నమ్మవద్దన్నారు.  కుట్రపూరిత కథనాలతో ఎన్డీయే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే దుష్ట చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ సేవల ముసుగువేసి.. వాలంటీర్‌ వ్యవస్థను రాజకీయంగా వాడుకున్నది వైసీపీ పాలకులేనని దుయ్యబట్టారు. ఏడాది కాలంగా వాలంటీర్‌ సేవలను రెన్యువల్‌ చేయకుండా దగా చేసిన గత పాలకులు.. ఇప్పుడు వాలంటీర్ల భవిష్యత్‌నూ దెబ్బకొట్టేందుకు నిరాధార, కుట్రపూరిత కథనాలను ప్రచారంలోకి తేవడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు.

అంతేకాదు, ఎన్నికల సమయంలో వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లచేత బలవంతంగా రాజీనామలు చేయించి దగా చేసిన విషయాన్ని మర్చిపోకూడదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనేక విధాలుగా వాలంటీర్‌ వ్యవస్థకు హామీలిచ్చినా.. వైసీపీ పాలకులు మాయచేసి, రెచ్చగొట్టి రాజీనామాలు చేయించారని గుర్తుచేశారు. వాలంటీర్ల భవిష్యత్‌ను అయోమయంలోకి నెట్టడం వెనుక గత పాలకుల కుట్ర దాగివుందన్న విషయాన్ని వాలంటీర్లు గ్రహించాలని కోరారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తెలుగుదేశం పార్టీ వాలంటీర్లకు ఎలాంటి అన్యాయం చేయదని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంపై అక్కసుతో వైసీపీ ప్రచారంలోకి తెస్తున్న నిరాధార కథనాలు నమ్మి వాలంటీర్లు భయాందోళనలకు గురికావొద్దని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios