మూడు రాజధానులకు సంబంధించి ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.
మూడు రాజధానులకు సంబంధించి ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. విశాఖపట్నం రాజధాని అంశంలో రాజీనామాకు సిద్దంగా ఉన్నానని ధర్మాన చెప్పారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటే సీఎం జగన్ వద్దన్నారని వెల్లడించారు. ఇక, వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాకు సిద్దంగా ఉన్నట్టుగా మంత్రి ధర్మానతో పాటుగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
గత వారం తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తాను రాజీనామా చేసి, వికేంద్రీకరణకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నట్టుగా చెప్పారు. వికేంద్రీకరణ ఉద్యమం చురుగ్గా, చైతన్యవంతంగా సాగేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అయితే సీఎం జగన్ మాత్రం రాజీనామా చేయవద్దని వారించినట్టుగా సమాచారం. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని మంత్రి ధర్మానకు ముఖ్యమంత్రి జగన్ సూచించినట్లు తెలిసింది. ఈ సమయంలో మంత్రివర్గం నుంచి వైదొలిగి ఉద్యమం చేపట్టాల్సిన అవసరం లేదని సీఎం జగన్ చెప్పారు.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ స్పష్టం చేసినట్టుగా తెలిసింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి అధికార వికేంద్రీకరణ, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి ధర్మానకు సీఎం జగన్ సూచించినట్టుగా తెలిసింది. ఇదిలా ఉంటే.. మరికొందరు వైసీపీ ముఖ్య నాయకులు కూడా ఇదే రకమైన ఆలోచనలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారని ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో సాగుతుంది.
ఇటీవల మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. విశాఖపట్నం రాజధాని కావాల్సిన సమయం అసన్నమైందన్నారు. విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు అభివృద్ధి అవకాశాలను పట్టించుకోకుండా హైదరాబాద్‌పై దృష్టి కేంద్రీకరించినప్పుడు పొరపాటు జరిగిందని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసి ఉంటే.. విభజన ఉద్యమం వచ్చేది కాదని అన్నారు.
ఉత్తర కోస్తాలోని చాలా భూములను స్థానికేతరులు ఆక్రమించుకున్నారని.. ఈ ప్రాంత ప్రజలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని అన్నారు. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోవడానికి ఉత్తర ఆంధ్రకు ఇదే చివరి అవకాశం అని అన్నారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు.
