ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించిన జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా కౌంటరిచ్చారు. పవన్ హరహర వీరమల్లు కాదు.. చంద్రబాబు విసిరిన విల్లు అంటూ మంత్రి ఎద్దేవా చేసారు.
అమరావతి: ఏలూరు జిల్లా చింతలపూడిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి వైసిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ (pawan kalyan) కు అదేస్థాయిలో కౌంటరిచ్చారు మంత్రి దాడిశెట్టి రాజా (dhadishetty raja). వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలెవ్వరికీ కష్టాలు లేవని... కేవలం పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడికి మాత్రమే కష్టాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు కష్టాల్లో వున్నారు కాబట్టే ఆయన కన్నీళ్లు తుడవటానికే పవన్ బయటకు వచ్చారని మంత్రి ఆరోపించారు.
''వైసీపీ ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఏలూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సమయంలో జనసేన కార్యకర్తలే జై జగన్ అంటూ నినాదాలు చేసారు. సొంత పార్టీ కార్యకర్తలే ఇలా నినదిస్తుంటే పవన్ కి వినపడలేదా? జనసేన కార్యక్రమంలో జగన్ మానియా చూసి పవన్ కి మతిపోయినట్లుంది'' అన్నారు మంత్రి రాజా.
''వైసిపి ప్రభుత్వం అన్ని వర్గాలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం రైతులను సరిగ్గా ఆదుకోవడం లేదని చంద్రబాబు వదిలిన హరహర విరమల్లు వచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో రైతులు అనేక కష్టాలు పడుతుంటే ఆ రోజు రైతుల కన్నీళ్లు పవన్ కి కన్పించలేవా? టిడిపి అధికారం ఉన్నంతసేపు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలు జరిగాయి. ఇవి పవన్ కు కనపడలేవా. ఇప్పుడు రైతులు కాదు చంద్రబాబు కష్టాల్లో ఉన్నారు కాబట్టే పవన్ కు ఏపీలో లేని కష్టాలు కొత్తగా కన్పిస్తాయి'' అని ఎద్దేవా చేసారు.
Video
''వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే కాకుండా అంతకంటే ఎక్కువే రైతులకు చేస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం చేస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కింద పెద్ద మొత్తంలో రైతులకు నేరుగా అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయి. ఇలా దేశంలో ఏ ప్రభుత్వం కూడా లేనంత అండగా రైతులకు వైసీపీ అండగా నిలుస్తుంది. ఇలా ఇప్పటికే వైసీపీ రైతుల పార్టీ అని నిరూపించుకుంది'' అన్నారు.
''ఈ రాష్ట్రంలో పవన్, చంద్రబాబు రెండు సిద్దాంతాలతో రాజకీయాలు చేస్తున్నారు. ఒకరేమో అమ్మే సిద్ధాంతాన్ని నమ్మితే ఇంకో నాయకుడు కొనే సిద్దాంతంతో రాజకీయాలు చేస్తున్నాడు. పార్టీ పెట్టి తనను నమ్ముకున్న వాళ్ళను అమ్మకానికి పెట్టడమే తన సిద్దాంతంగా పెట్టుకున్న నాయకుడు పవన్.... ఇప్పుడు మంచి రేటు కోసం తాపత్రయ పడ్డుతున్నాడు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టిస్తే ప్రశ్నించలేదు...ప్రశ్నిస్తే ఎక్కడ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వమంటారో అని పవన్ భయపడినట్లున్నాడు. ఈయన కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు'' అని మంత్రి దాడిశెట్టి సెటైర్లు వేసారు.
''సినిమాలో గెస్ట్ రోల్ చేసినట్లు...ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ తో వచ్చి గెస్ట్ రోల్ రాజకీయాలు చేస్తున్నాడు. అడ్వాన్స్ లు తీసుకుని తన రాజకీయ పార్టీని అద్దెకి ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికలకు జనసేన పార్టీని అద్దెకి ఇవ్వటానికి మాటలు కూడా అయ్యిపోయాయి. 2014లో అద్దెకు ఇచ్చిన పార్టీ....2024లో అద్దెకు సిద్దం అయింది. పవన్ హరహారా వీర మల్లు కాదు... చంద్రబాబు వదిలిన విల్లు'' అని మండిపడ్డారు.
''ప్యాకేజీ స్టార్ పవన్ రీల్ హీరో అయితే.... పీపుల్స్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో. ఎంతమంది మల్లులు...ఎన్ని విల్లులు విసిరినా అక్కడ ఉన్నది పద్మ వూహ్యంలో చికుకున్న అభిమన్యుడు కాదు... ఎన్నో పద్మవూహ్యలను చేదించిన జగన్మోహనుడు అనే విషయం గుర్తుంచుకోవాలి. జగన్ పాలన చూసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇవ్వడమే కరెక్ట్ అని ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి వరకు ఒక్క లెక్క ఇంకా నుండి మరో లెక్క...అనే విషయాన్ని ఈ మల్లులు, ఈ విల్లులు గుర్తుంచుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా, భరోసాగా ముందుకు తీసుకువెళుతున్న బలమైన ముఖ్యమంత్రి జగన్'' అని మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.
