వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. కావాలనే జగన్  తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం కాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు  గోదావరి నీటిని మంత్రి దేవినేని విడుదల చేశారు.

ముందుగా పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడికాల్వకు మంత్రి జలహారతి ఇచ్చారు. అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి తరలింపు వల్ల రూ.10 వేల కోట్ల పంట ఉత్పత్తి జరుగుతుందన్నారు.

 జగన్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం అంతు చూస్తానని జగన్‌ తిరుగుతున్నారని అన్నారు. పోలవరం సినిమా చూపిస్తున్నారంటూ జగన్ హేళన చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పోలవరం పనుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టామని, ఇప్పటికీ పోలవరంపై రూ.8500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి ఇంకా రూ.1400 కోట్లు రావాలని మంత్రి దేవినేని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ భాస్కర్‌, చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.