వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా). సీఎం అవ్వాలని నిర్ణయించుకుంటే పదవులు రావని.. ప్రజలు అనుకుంటేనే వస్తాయని రాజా పేర్కొన్నారు
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా). శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గంటకో మాట మాట్లాడుతూ పవన్ నవ్వుల పాలవుతున్నారని దుయ్యబట్టారు. సీఎం కాదు కదా పవన్‌ను ఎమ్మెల్యేను చేయడానికి కూడా సిద్ధంగా లేరని రామలింగేశ్వరరావు చురకలంటించారు. పవన్ కల్యాణ్ సభలకు జనం రావడం లేదని.. అయినా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నవ్వించేలాగా వున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.
సీఎం అవ్వాలని నిర్ణయించుకుంటే పదవులు రావని.. ప్రజలు అనుకుంటేనే వస్తాయని రాజా పేర్కొన్నారు. ఐశ్వర్యారాయ్‌నో, అనుష్కనో, తమన్నానో కుర్రాళ్లు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారని .. అయినా అనుకుంటే పెళ్లి అయిపోతుందా అని రామలింగేశ్వరరావు సెటైర్లు వేశారు. మంచి జరిగిందని భావిస్తేనే ఓట్లేయాలని జగన్ ప్రజలను కోరుతున్నారని మంత్రి గుర్తుచేశారు. అలా చెప్పే ధైర్యం పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడులకు ఉందా అని రామలింగేశ్వరరావు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నిర్వహించిన సభలు జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యాయని రాజా అన్నారు. ముందు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే విషయంపై పవన్‌కే క్లారిటీ లేదని దాడిశెట్టి రామలింగేశ్వరరావు ఎద్దేవా చేశారు.
Also Read: నా రెండు చెప్పులూ ఎవరో కొట్టేశారు .. ఇంతగా దిగజారాలా : పేర్ని నానిపై పవన్ సెటైర్లు
అంతకుముందు శుక్రవారం పిఠాపురం జరిగిన వారాహి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 219 హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. పిఠాపురంలో విగ్రహాలను ధ్వంసం చేసింది ఎవరంటే పిచ్చివాడని ప్రభుత్వం చెప్పిందని పవన్ చురకలంటించారు. రాష్ట్రంలో 219 విగ్రహాలను కూల్చింది, రాముడి తల నరికింది కూడా పిచ్చివాడేనా అని జనసేనాని సెటైర్లు వేశారు.
హిందూ విగ్రహాలపై దాడులు జరిగితే ఈ ముఖ్యమంత్రి ఒక్కరిని కూడా పట్టుకోలేదని.. వైసీపీది చచ్చు ప్రభుత్వమన్నారు. విగ్రహాల ధ్వంసం అనేది శాంతి భద్రతల సమస్య అని పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై తాను ప్రకాశం జిల్లా ఎస్పీని అడిగితే పై నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్ల తాము ఏం చేయలేకపోతున్నామని చెప్పారని జనసేనాని తెలిపారు. జనసేన ప్రభుత్వం రాగానే తొలి ప్రాధాన్యత శాంతి భద్రతలకే ఇస్తామని.. లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా వుంటే అన్ని సవ్యంగా వుంటాయని పవన్ పేర్కొన్నారు. కాకినాడ ఎమ్మెల్యే మాదిరిగా తాను అడ్డగోలుగా వచ్చి మట్టి తోలుకెళ్లనని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తనకు మత పిచ్చిలేదని.. సనాతన ధర్మం పట్ల గౌరవం వుందన్నారు
