తనపై వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే ఎవరో కొట్టేశారని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పేర్ని నానిపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే ఎవరో కొట్టేశారని అన్నారు. అందుకే వైట్ అండ్ వైట్ లాల్చికి బదులుగా కలర్ మార్చాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం చివరికి చెప్పులు కొట్టేసే స్థాయికి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
అంతకుముందు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ ఒక్క చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను నారాహి యాత్రగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. రోజుకో డైలాగ్ చెప్పి దాన్ని వ్యూహామంటారని పవన్ తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. వ్యూహాల్ని నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్లలేడని... ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారని పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని హితవు పలికారు.
Also Read: మక్కెలిరగదీస్తాం: పవన్ కళ్యాణ్ కు రెండు చెప్పులు చూపిన పేర్నినాని
జనసేనను నడిపిస్తుంది చంద్రబాబు అనే విషయాన్ని చిన్నపిల్లాడు కూడ చెబుతాడన్నారు. టీడీపీ కోసం కొత్త డ్రామాలకు పవన్ కళ్యాణ్ తెరతీశాడని ఆయన విమర్శించారు. బుస మాటలు , సొల్లు మాటలు తాను కూడా చెబుతానన్నారు. ఈ రకమైన మాటలు చెప్పడం నీకే వస్తుందా అని పేర్నినాని సెటైర్లు వేశారు. ఏపీలో జగన్ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు తీశారని ఆయన గుర్తు చేశారు.
పవన్ ఎన్ని సినిమాలు తీస్తే తాము ఎన్ని ఆపామని ఆయన ప్రశ్నించారు. సినిమాలు బాగా తీయకపోతే ఎందుకు ఆడుతాయని నాని సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వ హయంలో సినిమా టిక్కెట్లపై పన్నులు వేయలేదా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు చే అంటే చంద్రబాబు గుర్తు వస్తారన్నారు. సీఎం పదవి ఏమైనా దానమా , ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి అని పేర్ని నాని ప్రశ్నించారు.
