తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తప్పుబట్టారు.

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తప్పుబట్టారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఒకసారి ఏపీకి వచ్చి చూడాలని అన్నారు. ఏపీలో సామాజిక న్యాయం అమలు అవుతోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడకపోవడమే బెటర్ అని అన్నారు. పోలవరంను అడ్డుకున్నది బీఆర్ఎస్ నాయకత్వమేనని ఆరోపించారు. అదే సమయంలో సినీ నిర్మాత అశ్వనీదత్ చేసిన కామెంట్స్‌పై కూడా వేణుగోపాలకృష్ణ స్పందించారు. అశ్వినీదత్ ఎవరి మెప్పుకోసమే మాట్లాడుతున్నారని విమర్శించారు. 

నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కుల రాజకీయం నడుస్తోందని విమర్శించారు. ఏపీ కమ్మ, కాపు, రెడ్డి అంటూ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కట్టేది.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడేది కేసీఆరేనని అన్నారు. 

సీఎం కేసీఆర్ పవర్ ఏమిటనేది అందరికీ తెలుసునని అన్నారు. పక్క రాష్ట్రాల వాళ్లు కేసీఆర్ లాంటి సీఎం కావాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌లను తిడుతున్నారనీ వారు తమ ఉసురు కొట్టుకుని పోతారని కామెంట్ చేశారు. 

ఇదిలా ఉంటే.. నంది అవార్డులపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డ్స్ ఇస్తున్నారని తెలిపారు. రెండు, మూడేళ్ల తర్వాత అన్ని ఉత్తమ సినిమాలకు సక్రమంగా అవార్డులు ఇస్తారని చెప్పుకొచ్చారు.