ఇది సినిమా కాదు.. నిజ జీవితం , బాలయ్యే మా సభ్యులను రెచ్చగొట్టారు : మంత్రి చెల్లుబోయిన
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ జరిగిన పరిణామాలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణే తమ సభ్యులను రెచ్చగొట్టారని మంత్రి ఆరోపించారు. ఇది సినిమా కాదు..నిజ జీవితమని బాలయ్యకు మంత్రి చెల్లుబోయిన చురకలంటించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ జరిగిన పరిణామాలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షం నేడు ప్రవర్తించిన తీరు శాసనసభ నియమావళికి విరుద్దమన్నారు. సభాపతి పట్ల ప్రతిపక్ష నాయకులకు కనీస గౌరవం లేదన్నారు. వైసిపిలో నుండి గెలిచి పక్కకు వెళ్ళిన నాయకుడు ప్రతిపక్షం వాళ్ళ దగ్గర మెప్పుకోసం విన్యాసాలు చేసాడని కోటంరెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మీసాలు మెలివేసి, తోడలు కొట్టి బాలకృష్ణ మా సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెల్లుబోయిన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబటి రాంబాబు చెప్పింది వాస్తవం.. ఇది సినిమా కాదు..నిజ జీవితమని బాలయ్యకు మంత్రి చురకలంటించారు. ఎదో ఒక్కటి రెచ్చగొట్టి సభ నుండి వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నం ప్రతిపక్షం చేసిందన్నారు. సభలో ఉండి ప్రజల సమస్యలపై చర్చించే ఆలోచన ప్రతిపక్షం చేయడం లేదని చెల్లుబోయిన దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులైనటువంటి శాసనసభలో ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజా ధనాన్ని వృదా చేయడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుందకుని ఆయన ఎద్దేవాచేశారు. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రవర్తించిన తీరును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెల్లుబోయిన స్పష్టం చేశారు.
Also Read: ప్లూటు జింక ముందు ఊదు... జగన్ ముందు కాదు: బాలకృష్ణకు రోజా వార్నింగ్
అంతకుముందు మంత్రి రోజా మాట్లాడుతూ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలా దారుణంగా ప్రవర్తించారని... పవిత్రమైన చట్టసభలో ఇలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. శాసనసభలో టిడిపి సభ్యులు సైకోల్లా ప్రవర్తించారని రోజా మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో భారీ స్కాం జరిగిందని... సమగ్ర విచారణ తర్వాతే చంద్రబాబను సిఐడి అరెస్ట్ చేసిందని రోజా తెలిపారు. చంద్రబాబు అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు పోలీసుల వద్ద వున్నాయన్నారు. చంద్రబాబు పెద్ద దోపిడీ దొంగ అని ప్రజలకు అర్థమయ్యిందన్నారు. తప్పు చేసినట్లు బయటపడినా చంద్రబాబు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని... కానీ అతడి స్వరూపం అందరికీ తెలిసిపోయిందన్నారు.
బావ కళ్లలో ఆనందం కోసమే హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రయత్నిస్తున్నాడని మంత్రి రోజా పేర్కొన్నారు. అసెంబ్లీపైనా, స్పీకర్ పైనా గౌరవం లేకుండా సభలో గందరగోళం సృష్టించారన్నారు. అయినా నిండుసభలో మీసాలు తిప్పటం, తొడలు కొట్టటం ఎంతవరకు సబబో వారే ఆలోచించుకోవాలని అన్నారు. ఈ మీసాలు తిప్పడమేదో కన్నతండ్రి ఎన్టీఆర్ పై చెప్పులు వేయించినప్పుడు తిప్పివుంటే బావుండేదన్నారు. ప్లూటు జింక ముందు ఊదు... సింహంలాంటి జగన్ ముందు కాదు అంటూ బాలయ్య డైలాగ్ లో ఆయనకే హెచ్చరించారు మంత్రి రోజా.