తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్తత పరిస్ధితులకు కారణమయ్యారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సైతం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనపర్తిలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు దారితీసిందన్నారు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నిరంకుశ రాజులాగా వ్యవహరించారని ఆయన ఎద్దేవా చేశారు. చట్టాలను గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని .. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని మంత్రి దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యలు రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా వున్నాయని.. ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారంటూ చెల్లుబోయిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే జనం కూడా పట్టించుకోవడం లేదని.. విపక్షాన్ని ఛీకొడుతున్నారని వేణుగోపాల కృష్ణ చురకలంటించారు.చంద్రబాబు విజనరీ కాదని, విజన్ లేని వ్యక్తి అని మంత్రి సెటైర్లు వేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా.. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీసు స్టేషన్‌లో చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు 8 మంది టీడీపీ నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ భక్తవత్సల ఫిర్యాదుతో కేసు నమోదైంది. శుక్రవారం రోజున చంద్రబాబు నాయుడు అనపర్తి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం బలభద్రపురం నుంచి అనపర్తి వరకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం అనపర్తిలో రోడ్‌లో మాట్లాడారు. అయితే చంద్రబాబు, టీడీపీ నాయకులపై నిబంధనల ఉల్లంఘన, పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించారని డీఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు సహా, టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also REad: డీఎస్పీ ఫిర్యాదు.. చంద్రబాబు నాయుడుపై బిక్కవోలు పీఎస్‌లో కేసు నమోదు..

అసలేం జరిగిందంటే.. శుక్రవారం చంద్రబాబు నాయుడు అనపర్తి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు రోడ్ షో వేయవచ్చని.. అయితే రోడ్డుపై బహిరంగ సభలు పెట్టవద్దని పోలీసులు టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. వీరి ప్రతిపాదనకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి నాయుడుతో పాటు ఇతర నాయకులు అంగీకరించలేదు. ఇక, బలభద్రపురం గ్రామం వద్ద అనపర్తికి వెళ్లే దారిని పోలీసులు మూసివేసే ప్రయత్నం చేశారు. పోలీసులు, పార్టీ నేతలతో చర్చలు జరిపిన చంద్రబాబు అనపర్తి పర్యటనకు సిద్ధమయ్యారు. ఇంతలో టీడీపీ క్యాడర్ రోడ్డుపై పోలీసులు ఉంచిన బారికేడ్లను తోసివేయడంతో చంద్రబాబు ముందుకు సాగారు.