విజయనగరం జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని నగరంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామ రాజు, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా. నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ  జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేటి నుంచి కరోనా వాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే 26 వేల మంది కింది నుంచి పై స్థాయి ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, అధికారులకు తొలి విడతగా వాక్సినేషన్ చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

దశల వారీగా అన్ని వర్గాల వారికి కరోనా టీకా వేసే కార్యక్రమం చేపడతామని తెలిపిన మంత్రి, ఎవ్వరూ వాక్సిన్ వేయించు కోవడానికి ఆతృత పడొద్దని సూచించారు. జిల్లాలోని 15 ఆసుపత్రుల్లో యీ వాక్సినేషన్ చేపట్టామని వెల్లడించారు. 

వ్యాక్సిన్ మొదటి డోసు తరువాత 28 రోజులకు రెండో డోసు వాక్సిన్ వేస్తారని  మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.