పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయినా ఫరవాలేదుగానీ.. బాబుకు అమరావతిలో బినామీ ఆస్తులే ముఖ్యమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 20 మంది ఎమ్మెల్యేలా..? లేక.. లక్ష కోట్లా.. ? అన్న ప్రశ్నకు ఎమ్మెల్యేలను వదులుకుంటానంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.

బాబుకు డబ్బు.. ఆస్తులు ముఖ్యమని బొత్స ఆరోపించారు. తన ఆస్తుల కోసం.. తన ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా ఫణంగా పెట్టటానికి బాబు సిద్ధపడ్డారని మంత్రి విమర్శించారు. అధికారంపై ఆశలు వదులుకుని తనకు డబ్బే ముఖ్యమని బాబు అల్టిమేటం ఇచ్చారని మండిపడ్డారు.

2014లో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఈ డెడ్ లైన్లు ఎందుకు పెట్టలేదుని బొత్స నిలదీశారు. చంద్రబాబు పనికిమాలిన సవాళ్ళు చేస్తున్నాడు.. రాష్ట్రానికి వినాశనకారిగా మారారని, చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో.. ప్రజల కోసం చేసింది శూన్యమని మంత్రి దుయ్యబట్టారు.

తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, అమరావతి నిర్మాణాల్లో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనుకబడిపోయిందని బొత్స మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని.. ఏ ముఖం పెట్టుకుని ఈ ప్రాంత టిడిపి నేతలు ఆ పార్టీలో కొనసాగుతున్నారని మంత్రి విమర్శించారు. తాజాగా కోర్ట్‌కు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌లో చంద్రబాబు బాగోతం బయటపడిందని బొత్స గుర్తుచేశారు.

ఎపి రాజధానిపై 2014 విభజన చట్టం, సెక్షన్ 6 ప్రకారం శివరామకృష్ణ కమిటీ ఏర్పాటైందని.. శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు.

ఐదేళ్లలో  అమరావతి కోసం చంద్రబాబు ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లేనని.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సత్యనారాయణ స్పష్టం చేశారు.

దమ్ముంటే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని ఆయన సవాల్ విసిరారు. ఒమర్ అబ్ధుల్లా కూడా చంద్రబాబు మోసపూరిత నైజంను స్పష్టంగా చెప్పారని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు.

చంద్రబాబుకు ఈ రోజు వరకు ఆంధ్రరాష్ట్రంలో సొంత ఇల్లు లేదని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్, చెన్నై, ముంబాయ్, బెంగుళూరులతో సమానంగా విశాఖను కూడా అభివృద్ధి చేస్తామని బొత్స స్పష్టం చేశారు.