ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ రాయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం చేశారు.

టీడీపీ హయాంలో నియమించబడ్డారు కాబట్టి చంద్రబాబుకు గురు దక్షిణ కింద ఎన్నికలు నిర్వహిస్తామనడం భావ్యం కాదని బొత్స చెప్పారు. కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేశామని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. అందుకే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గవర్నర్‌కు సలహాలు ఇచ్చే స్థాయి నిమ్మగడ్డకు వుందా ..? చంద్రబాబు ఏం చెబితే నిమ్మగడ్డ అదే చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

జనవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం వుందని.. ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుందని బొత్స స్పష్టం చేశారు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధానే చెప్పారని.. నిమ్మగడ్డకు ఎన్నికల నిర్వహణ బాధ్యత ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.