అన్న క్యాంటీన్ల మూసివేతపై వస్తున్న ఆరోపణలపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తమకు క్యాంటీన్లను మూసివేసే ఆలోచన లేదని... వీటి నిర్వహణలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 182 అన్న క్యాంటీన్లలో చాలా వరకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఏర్పాటు చేశారని.. కానీ వీటి వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని మంత్రి వెల్లడించారు.

హడావిడిగా , ప్రచారంతో ప్రారంభించిన టీడీపీ ప్రభుత్వం.. వీటి నిర్మాణానికి సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులను ఇంతవరకు చెల్లించలేదని బొత్స ఎద్దేవా చేశారు.

మొత్తం క్యాంటీన్లలో 68 మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లుగా గుర్తించామని.. వీటిలో ఏవి అవసరమో, ఏ ప్రదేశాల్లో వీటి ఆవశ్యకత ఉందో అన్న వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొత్త పాలసీని తీసుకొచ్చి చర్యలు తీసుకుంటామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.