చంద్రబాబు పదవి ఇచ్చాడని.. 2018లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేదా..? అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ... నిమ్మగడ్డతో చంద్రబాబు లాలూచీ పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

గడువు ముగిసినా.. చంద్రబాబు హయాంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? అధికారంతో పాటు బాధ్యత ఉందన్నది నిమ్మగడ్డ గుర్తెరగాలి. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలా నిమ్మగడ్డ మాట్లాడారు. ఎన్నికలు జరిగితే టీడీపీకి 10 శాతం సీట్లు కూడా రావు అంటూ ఎద్దేవా చేశారు. 

ప్రజల మనసెరిగి పరిపాలన చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇంత చేస్తుంటే విగ్రహాలను ఎత్తుకెళితే తప్పేంటి అని  చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నాడు. ఇంట్లో కూర్చుని ప్రజాస్వామ్యం జిందాబాద్ అనే ప్రతిపక్షం ఉండటం మన ఖర్మ అంటూ విరుచుకుపడ్డారు. 

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు అధికారాలు ఉన్నట్టే.. బాధ్యత కూడా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే నిమ్మగడ్డ అధికారాలే చూస్తున్నారు తప్పితే బాధ్యతగా పనిచేయడం లేదన్నారు.

ప్రపంచం అంతా కోవిడ్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంటే, ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతుంటే,మరోవైపు ఉన్నపళంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఎందుకు ఆరాటపడుతుందని ప్రశ్నించారు. 

జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా కోటికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించటమే కాకుండా.. కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరోవైపు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటుందన్్నారు.

30 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషనర్ ప్రెస్ మీట్ పెడితే.. ఎలక్షన్ విధులు, ఎలక్షన్ షెడ్యూల్ ను ప్రకటించేవారు. ఈరోజు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాట్లాడిన తీరు చూస్తే.. ఆయన ఒక రాజకీయ నాయకుడిలా, ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలా మాట్లాడటం చూస్తే బాధేసింది.  ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా నేను ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అని విచారం వ్యక్తం చేశారు. 

పైగా పంచాయితీ రాజ్ శాఖ అధికారులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని నిమ్మగడ్డ మాట్లాడుతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది కూడా గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేసిన విషయాన్ని మరిచిపోయారా? అని నిమ్మగడ్డను ప్రశ్నించారు. 

ఆయన ఏ విధంగా జనరల్ ఎన్నికలు నిర్వహించారో చూశాం. రాజకీయ స్వార్థంతో ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు ఆరోజు ఆయన్ను ఎంతగా దుర్భాషలాడినా.. బెదిరించినా, తొణకకుండా, బెదరకుండా, ఎంతో సంయమనంతో ఉండి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిన విషయం గుర్తు చేసుకోండి అని చెప్పుకొచ్చారు. 

ఈరోజు అటువంటి సమర్థులైన అధికారులపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధంగా వేలెత్తి చూపుతారు..? మీరూ గతంలో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తే.. ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నంత మాత్రాన ఏకపక్షంగా వ్యవహరించటం, సీనియర్ అధికారులపై పెత్తనం చలాయించడం సమంజసం కాదు అని హితవు పలికారు.

వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత పరిచయాలు కోసం.. ఈరోజు ఎన్నికల కమిషన్ స్థానంలో ఉన్న వారు వ్యవస్థలను ఉపయోగించుకోవడం శోచనీయం. ఎన్నికలు ఆయన పెడితే.. కోవిడ్ తో ప్రజలకు ఇబ్బందులు వస్తే.. ప్రభుత్వానిది బాధ్యత అని, ప్రభుత్వంపై నెట్టి వేసి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్టు..? అని ప్రశ్నించారు.

ఆరోజు కేంద్రం నుంచి వచ్చే 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు మురిగిపోతాయని చెప్పినా వినకుండా, ఎన్నికలను మధ్యలో నిలిపేసి, ఎవరి ప్రోద్భలంతోనో, ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసమో, కోవిడ్ ను సాకుగా చూపించి ఇదే ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేశారు. ఆరోజు కరోనా కేసులు రాష్ట్రంలో 50 కూడా లేవు. ఈరోజు కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుందని ప్రపంచ అంతా గజగజలాడుతుంటే, ఎన్నికలు పెడతామని మొండిగా వెళ్ళటం సమంజసమా..? అని అడిగారు.

మరి చంద్రబాబు నాయుడు హయాంలో, ఎన్నికల గడువు దాటిపోయినా, ఎందుకు ఎన్నికలు పెట్టలేదు...?  మీ సామాజికవర్గమనా..?  సన్నిహితుడనా..?  మీకు పదవి ఇచ్చాడనా..?  అప్పుడు మీ బాధ్యత మీకు గుర్తు రాలేదా..?  మీ అధికారాలు అప్పుడు గుర్తుకు రాలేదా..? ఎన్నికలు రెండు - మూడు నెలలు ఆలస్యమైతే వచ్చే నష్టమేంటి..?  ఎన్నికల కమిషనర్ సమాధానం చెప్పాలి. నా మాటే చెల్లుబాటు అవ్వాలనే ఉద్దేశంతో అహంకారంతో ప్రవర్తించడం కరెక్టు కాదు అంటూ చెప్పుకొచ్చారు.

ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడాలని 151 సీట్లతో జగన్ మోహన్ రెడ్డిగారికి ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ పని చేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అధికారులను తొలగించండి అని నిమ్మగడ్డ ఆర్డర్లు వేశారు. ఇదేనా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో మీరు నేర్చుకున్నది..?న్యాయస్థానాల్లో ఈ అంశం ఉన్నప్పుడు.. ఆ నిర్ణయం వచ్చే వరకు ఎందుకు ఆగలేకపోతున్నారు. సుప్రీం తీర్పునకు ఎవరైనా బద్ధులుగా ఉండాల్సిందే.. ఎందుకు ఇంత గాబరా పడుతున్నారు.. ఎందుకు ఇంత ఆరాటం..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు 10 శాతం సీట్లు అయినా వస్తాయని అనుకుంటున్నారా.. ఆఖరికి మీరు ప్రచారం చేసినా సీట్లు రావు, ఓట్లు రావు. ఈ రాష్ట్రాన్ని వదలని చంద్రబాబు లాంటి శనిని వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు ఏ ఒక్కరోజైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా..? స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారి స్ఫూర్తితో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఎన్నికల ప్రణాళికలో పెట్టిన హామీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారు.  ప్రజల మనసెరిగి పరిపాలన చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 

జగన్ మోహన్ రెడ్డిగారి పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారన్న అక్కసుతో దేవాలయాలపై దాడులు.. విగ్రహాలను ఎత్తుకెళ్ళడం.. ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు ఇటీవలకాలంలో పాల్పడుతున్నారు. దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు చోరీకి గురైతే.. మీరు ఏకంగా దేవాదాయ శాఖ మంత్రిపైనే విమర్శలు చేశారు. ఈరోజు దొంగలను పట్టుకున్నామా.. లేదా..

మొన్న టెక్కలిలో ఏం జరిగింది. అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో, ఆయన అనుచరులే.. నంది విగ్రహాన్ని ఏ విధంగా తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టారో సీసీ టీవీల్లో చూశాం. అదే సీసీ ఫుటేజి దొరక్కపోతే.. ఇదే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేదో వేరే చెప్పాల్సిన పనిలేదని మండిపడ్డారు. 

పైగా నంది విగ్రహం తీసుకెళితే తప్పేంటిని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నాడు. మరోవైపు ఇదే చంద్రబాబు దేవాలయాలకు అపచారం చేస్తారా.. అంటాడు. విగ్రహాలను ఎత్తుకెళితే తప్పేంటి అని  చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నాడు. రమేష్ కుమార్ తో చంద్రబాబు లాలూచీపడి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎవరైనా రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నవారు వ్యవస్థలను కాపాడుకోవాలి తప్పితే.. వ్యక్తులను కాపాడాల్సిన పనిలేదు. వ్యక్తుల కోసం పనిచేస్తే.. వ్యవస్థలు దెబ్బతింటాయని అన్నారు.

ఏకగ్రీవంగా ఎన్నిక అయితే.. వాటి మీద దృష్టిపెడతానని నిమ్మగడ్డ రమేష్ అంటుంటే.. ఏడవాలో, నవ్వాలో అర్థం కావటం లేదు. పంచాయితీలు అంటేనే పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు. ఏకగ్రీవమైతే.. ప్రోత్సాహక నిధులు ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది.  అంటే నిమ్మగడ్డ వెనకాల ఉన్న దురుద్దేశం ఏమిటో అర్థమవుతుంది.  ఇటువంటి వ్యక్తులు రాజ్యాంగ వ్యవస్థలో ఉండటం దురదృష్టం.  ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రతి పౌరుడి రక్షణ కోసం పనిచేస్తుందంటూ చెప్పుకొచ్చారు.