ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. డ్యాన్సులు వేసుకునే వ్యక్తి మనకు సీఎంగా అవసరమా అని ప్రశ్నించారు. 

నిన్న కత్తిపూడి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. రక్తపు మరకలు అంటిన సీఎం మనకు అవసరమా అన్న పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. డ్యాన్సులు వేసుకునే వ్యక్తి మనకు సీఎంగా అవసరమా అని ప్రశ్నించారు. సచివాలయల్లో అవినీతి నిరూపిస్తే గుండు గీయించుకుంటానని బొత్ సత్యనారాయణ సవాల్ విసిరారు. 

అటు ఏపీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా బొత్స స్పందించారు. హక్కుగా రావాల్సిన నిధులు తప్ప ఏపీకి కేంద్రం రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ అంటే అమిత్ షాకు , బీజేపీకి తెలుసా అని ఆయన నిలదీశారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, అమిత్ షా వ్యాఖ్యలు అలాగే వున్నాయని బొత్స చురకలంటించారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను అడిగితే తెలుస్తుందని ఆయన హితవు పలికారు. విశాఖ ఉక్కును అమ్మేస్తూ కొత్త డ్రామాకు తెరదీస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.

ALso Read: నాకు ఆర్జీ ఇచ్చిందని ఆమె అన్నను వైసీపీ చంపేసింది .. జనవాణికి ఆ అమ్మాయే స్పూర్తి : పవన్

అంతకుముందు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ ఒక్క చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను నారాహి యాత్రగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. రోజుకో డైలాగ్ చెప్పి దాన్ని వ్యూహామంటారని పవన్ తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. వ్యూహాల్ని నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్లలేడని... ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారని పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని హితవు పలికారు. 

జనసేనను నడిపిస్తుంది చంద్రబాబు అనే విషయాన్ని చిన్నపిల్లాడు కూడ చెబుతాడన్నారు. టీడీపీ కోసం కొత్త డ్రామాలకు పవన్ కళ్యాణ్ తెరతీశాడని ఆయన విమర్శించారు. బుస మాటలు , సొల్లు మాటలు తాను కూడా చెబుతానన్నారు. ఈ రకమైన మాటలు చెప్పడం నీకే వస్తుందా అని పేర్నినాని సెటైర్లు వేశారు. ఏపీలో జగన్ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు తీశారని ఆయన గుర్తు చేశారు.

పవన్ ఎన్ని సినిమాలు తీస్తే తాము ఎన్ని ఆపామని ఆయన ప్రశ్నించారు. సినిమాలు బాగా తీయకపోతే ఎందుకు ఆడుతాయని నాని సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వ హయంలో సినిమా టిక్కెట్లపై పన్నులు వేయలేదా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు చే అంటే చంద్రబాబు గుర్తు వస్తారన్నారు. సీఎం పదవి ఏమైనా దానమా , ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి అని పేర్ని నాని ప్రశ్నించారు.