జనవాణి కార్యక్రమం ప్రారంభించడానికి ఒక అమ్మాయి కారణమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . తనకు పిటిషన్ ఇచ్చిన ఓ అమ్మాయి సోదరుడిని వైసీపీ మనుషులు చంపేశారని ఆయన తెలిపారు.
జనవాణి కార్యక్రమం ప్రారంభించడానికి ఒక అమ్మాయి కారణమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆయన గురువారం కాకినాడ జిల్లా గొల్లప్రోలు కార్యక్రమంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 34 మంది నుంచి ఆర్జీలు స్వీకరించారు పవన్. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తనకు కష్టం కలిగిందని తనకు పిటిషన్ ఇచ్చిన ఓ అమ్మాయి సోదరుడిని చంపేశారని తెలిపారు.
కరోనా సమయంలో ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని చెప్పినందుకు డాక్టర్ సుధాకర్‌పై పిచ్చోడి ముద్ర వేసి, చివరికి చనిపోయేలా చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పిటిషన్‌లను తీసుకుని వీటిపై అధ్యయనం చేస్తానని ఆయన తెలిపారు. ఆర్జీలను సంబంధిత అధికారులకు పంపుతామని పవన్ చెప్పారు. వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుందని ఆయన ఆకాంక్షించారు. తన కోసం కాకుండా ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తానని పవన్ చెప్పారు. వైసీపీ నాయకులకు చేతలతో చూపిస్తానని పేర్కొన్నారు.
ALso Read: మక్కెలిరగదీస్తాం: పవన్ కళ్యాణ్ కు రెండు చెప్పులు చూపిన పేర్నినాని
అంతకుముందు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ ఒక్క చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను నారాహి యాత్రగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. రోజుకో డైలాగ్ చెప్పి దాన్ని వ్యూహామంటారని పవన్ తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. వ్యూహాల్ని నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్లలేడని... ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారని పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని హితవు పలికారు.
జనసేనను నడిపిస్తుంది చంద్రబాబు అనే విషయాన్ని చిన్నపిల్లాడు కూడ చెబుతాడన్నారు. టీడీపీ కోసం కొత్త డ్రామాలకు పవన్ కళ్యాణ్ తెరతీశాడని ఆయన విమర్శించారు. బుస మాటలు , సొల్లు మాటలు తాను కూడా చెబుతానన్నారు. ఈ రకమైన మాటలు చెప్పడం నీకే వస్తుందా అని పేర్నినాని సెటైర్లు వేశారు. ఏపీలో జగన్ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు తీశారని ఆయన గుర్తు చేశారు. పవన్ ఎన్ని సినిమాలు తీస్తే తాము ఎన్ని ఆపామని ఆయన ప్రశ్నించారు. సినిమాలు బాగా తీయకపోతే ఎందుకు ఆడుతాయని నాని సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వ హయంలో సినిమా టిక్కెట్లపై పన్నులు వేయలేదా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు చే అంటే చంద్రబాబు గుర్తు వస్తారన్నారు. సీఎం పదవి ఏమైనా దానమా , ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి అని పేర్ని నాని ప్రశ్నించారు.
