రేపు ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు పండుగ రోజన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

వీటిలో 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభం కానున్నాయని బొత్స వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇదో మహత్తర ఘట్టమని.. రూ.1కే లక్షా 45 వేల ఇళ్లను అందజేయనున్నామని బొత్స చెప్పారు.

4 లక్షల మంది సొంత స్థలం వున్న వారికి రూ.1.80 లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని మంత్రి తెలిపారు. పేదరికమే ప్రాతిపదికగా ఇళ్ల పట్టాలను కేటాయిస్తున్నామని... రూ.23,535 కోట్ల విలువైన భూములను ఇళ్లకు కేటాయిస్తున్నామని బొత్స పేర్కొన్నారు.

కాగా, దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ఇళ్ల స్థల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ భూమి పూజలను పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రెండు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ప్రారంభిస్తారు. 26 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పట్టాల పంపిణీ చేయడంతోపాటు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.