Asianet News TeluguAsianet News Telugu

సంక్షేమం కోసం శ్రమిస్తున్నాం.. అప్పులు సహజం: బొత్స వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అభివృద్ధి కోసమే కానీ అవినీతి చేయడం కోసం కాదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.  

minister botsa satyanarayana comments on ap state liabilities ksp
Author
Vizianagaram, First Published Jan 13, 2021, 9:19 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అభివృద్ధి కోసమే కానీ అవినీతి చేయడం కోసం కాదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.  విజయనగరంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పారదర్శకత కోసమే కొత్త మున్సిపల్‌ పన్నుల విధానాన్ని తీసుకొచ్చామన్నారు.

చంద్రబాబు శాపనార్థాలే తమకు దీవెనలని బొత్స వ్యాఖ్యానించారు. ఆయన చేసిన తప్పులపై పశ్చాత్తాపం పడకుండా విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇష్టారీతిన పన్నులు వేస్తూ ప్రజలను బాధిస్తున్నామంటూ చంద్రబాబు చేసిన విమర్శలను బొత్స ఖండించారు.

రాష్ట్రంలోని ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని.. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకొస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్న తమ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చంద్రబాబుకి హితవు పలికారు.

ప్రజల శ్రేయస్సు కోసం చేపడుతున్న కార్యక్రమాల వల్ల అప్పులు పెరిగాయని.. ఇది ఎక్కడైనా సహజమేనని బొత్స వివరించారు. కరోనా కారణంగానే ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ వద్దంటున్నట్లు ఆయన వెల్లడించారు.

స్థానిక ఎన్నికలపై తెలుగుదేశం కావాలనే రాద్ధాంతం చేస్తోందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికలపై వైసీపీకి ఎలాంటి భయం లేదని మంత్రి స్పష్టం చేశారు.  

మాన్సాస్‌ ట్రస్టు రద్దు చేయాలని అశోక్‌ గజపతిరాజు గతంలోనే లేఖ రాశారని బొత్స గుర్తుచేశారు. ట్రస్టు ఛైర్మన్‌గా ఆనందగజపతిరాజు ఉండడం ఇష్టం లేకే అశోక్‌ లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు.

మాన్సాస్‌ ట్రస్టు ప్రభుత్వంలో విలీనం చేయొద్దని గతంలో ఆనంద్‌ విజ్ఞప్తి చేశారని.. ఆయన విజ్ఞప్తి మేరకు ట్రస్టు ఛైర్మన్‌గా ఆనంద్‌నే కొనసాగించినట్లు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios