వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు చేపట్టిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం గురించి మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అమరావతి :గత టిడిపి ప్రభుత్వానికి ప్రస్తుత వైసిపి ప్రభుత్వానికి తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయడమే 'జగనన్నే మా భవిష్యత్' కార్యక్రమ ఉద్దేశ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రజలకు మరింత చేరువయ్యేలా రూపొందించిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఇవాళ(శుక్రవారం) ప్రారంభమయ్యింది.ఈ సందర్భంగా మంత్రి బొత్స ఈ కార్యక్రమం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
పార్టీ కన్వీనర్లు, గృహ సారథులు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వంలో, ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమం ఎలా సాగుతుందో వివరిస్తారని బొత్స తెలిపారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా కోటీ 80లక్షల కుటుంబాలను కార్యకర్తల ద్వారా వైసిపి చేరువ చేస్తామని అన్నారు. ఇవాళ ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 20 వరకు కొనసాగుతుందని తెలిపారు. జగన్ మాత్రమే మా భవిష్యత్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని బొత్స పేర్కొన్నారు.
Read More జగనన్నే మా భవిష్యత్తుతో విష ప్రచారానికి చెక్: సజ్జల
దేశ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చిందని... మేనిపెస్టో లోని ప్రతి అంశాన్ని నూటికి నూరు శాతం నెరవేర్చామని అన్నారు. నాలుగేళ్ళ పాలన ముగించుకుని ఐదో ఏట అడుగుపెడుతున్న వేళ ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని బొత్స పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ... వైసిపి ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పనిచేస్తోందని అన్నారు. ఏ రాజకీయ పార్టీ నిర్వహించని కార్యక్రమం ప్రస్తుతం వైసీపీ చేస్తోందని... ప్రజల దగ్గరకు పార్టీని తీసుకెళ్లడమే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు.
ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో పెద్ద సర్వే మాదిరిగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం జరుగుతోందని అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ చేసి చూపించామని... వీటి గురించి ప్రతి ఇంటిలో చెప్పాలనే ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. భవిష్యత్ లో ఇంకా మెరుగైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనేదే సీఎం జగన్ ఉద్దేశమని అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు.
