ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా... లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేత కోడెల ఆత్మహత్యను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని బొత్స విమర్శించారు. కోడెల కేసుల వ్యవహారంపై టీడీపీ గవర్నర్ కి ఫిర్యాదు చేయడం, సీబీఐ విచారణ కోరడాన్ని కూడా బొత్స తప్పుపట్టారు.

శుక్రవారం ఉదయం బొత్స మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కోడెల విషయంలో గవర్నర్ ని ఆశ్రయిస్తున్నారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా... లేనప్పుడు మరో విధంగా ప్రవర్తించడం తగదన్నారు. గతంలో సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడాన్ని వ్యతిరేకించిన చంద్రబాబే... ఇప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఒత్తిడి కారణంగానే కోడెల చనిపోయారని చెబుతున్న చంద్రబాబు..గడిచిన మూడు నెలల్లో ఎన్నిసార్లు ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కోడెల ఫోన్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. కోడెల ఫోన్ బయటపడితే.. అసలు నిజాలు బయటకువస్తాయని ఆయన అన్నారు. ప్రతి విషయానికీ సీఎం జగన్ స్పందించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని... అనవరస విషయాల గురించి స్పందించి టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం సీఎం జగన్ కి లేదని చెప్పారు.