అమరావతి:స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తోందనే భయంతోనే శాంతి భద్రతలకు ఆటంకం కల్గించాలని చంద్రబాబునాయుడు  ప్రయత్నిస్తున్నారని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  ఆరోపించారు.

Also read:పిల్లాడిని ఢీకొట్టారు, అందుకే..:మాచర్ల ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి

బుధవారం నాడు అమరావతిలో ఆయన  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఐదేళ్లలో చంద్రబాబునాయుడు ఏ రకంగా పాలన చేశారో అందరికీ తెలుసునని చెప్పారు. పది కార్లలో విజయవాడ నుండి బొండా ఉమ,  బుద్దా వెంకన్నలు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు.

 మామాను వెన్నుపోటు పొడిచి ఏ రకంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు.  ప్రతి రోజూ  మీ పార్టీ నుండి  ఎందుకు నేతలు వలసలు వెళ్తున్నారో చెప్పాలని ఆయన బాబును ప్రశ్నించారు.

పులివెందులలో సతీష్ రెడ్డికి ఏ రకంగా అన్యాయం చేశారో ఆయనే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో వైపు విశాఖ జిల్లాకు చెందిన పంచకర్ల రమేష్ బాబు  కూడ మాట్లాడిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. విశాఖను వాణిజ్య రాజధాని చేయడం వ్యతిరేకించడాన్ని జీర్ణించుకోలేకపోయినట్టుగా రమేష్ బాబు ప్రకటించిన విషయాన్ని  మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలుసునన్నారు. జిల్లాల్లో ఏ రకంగా  శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామో అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగే పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకోమని సీఎం చెప్పిన విషయాన్ని  మంత్రి గుర్తు చేశారు.