ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పని అయిపోయిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా... టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా.. గెలిచిన నేతలతు కూడా పార్టీ మారేందుకు సన్నామాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పని అయిపోయిందంటూ మంత్రి అవంతి పేర్కొన్నారు.

త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలను ప్రజలు ఇచ్చారని అన్నారు. బుధవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అవంతి.. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అభివృద్ధిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. 

అధికారులు, నాయకులు సమన్వయంతో కలిసి పనిచేసి విశాఖని అభివృద్ధి చేయాలన్నారు. అర్హులందరికీ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటే ఎంతో ధైర్యం కావాలన్నారు. ఆ ధైర్యం సీఎం జగన్‌కు ఉంది కాబట్టే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. సోనియా గాంధీ లాంటివారినే ఎదిరించిన నేత వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు.