టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డితో మొదలైన ఈ రచ్చలోకి గుడివాడ అమర్‌నాథ్ రావడంతో రక్తి కట్టింది.

తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ .. వెలగపూడిపై విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇళ్ల స్థలాల పట్టాల్లో అవినీతి జరిగిందంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

వెలగపూడి రామకృష్ణబాబు చరిత్ర అంతా నేరమయమని.. దొంగ ఓట్లతో ఆయన గెలిచారని అవంతి ఆరోపించారు. వెలగపూడి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంత్రి సవాల్ విసిరారు.

రొయ్య మీసాలతో భయపెట్టలేరంటూ అవంతి సెటైర్లు వేశారు. చంద్రబాబుకు విశాఖ ప్రజలు ఓట్లు, సీట్లు కావాలి కానీ, పరిపాలన రాజధాని మాత్రం ఆయనకు అక్కర్లేదని శ్రీనివాస్ ప్రశ్నించారు.

ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలన రాజధాని నిర్మాణం జరుగుతుందని.. పరిపాలన రాజధానిగా నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కోర్టుల్లో కేసులు ద్వారా అడ్డుకోవద్దని మంత్రి టీడీపీ నేతలకు సూచించారు. 

విశాఖ వాసులకు గజం 30 వేలు ధర పలుకుతున్న ధరతో 15 లక్షలు విలువైన భూమిని లబ్ధిదారులకు జగన్‌ అందిస్తున్నారని అవంతి శ్రీనివాస్ తెలిపారు. రూ. 900 కోట్లతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో సీఎం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ తూర్పు నియోజకవర్గంలో తమ పార్టీ ఓడిపోయినా.. అభివృద్ధి చేస్తున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు రద్దు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని మంత్రి ప్రశంసించారు.