భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం, తెలుగు తేజం పీవీ సింధూను ఆంధ్రప్రదేశ్ క్రీడల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని సీఎం జగన్‌ను కోరుతానన్నారు ఏపీ క్రీడల మంత్రి అవంతి శ్రీనివాస్.

ఆదివారం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఒలింపిక్ డే రన్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒలింపిక్ రన్‌లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.

ఒలింపిక్ అసోసియేషన్‌లో గత నాలుగేళ్లలో ఎన్నో రాజకీయాలు, వివాదాలు నడిచాయని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకగ్రీవంగా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు చేశామని అవంతి స్పష్టం చేశారు.

ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాతే తన దినచర్యను ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి ఆయనలో ఉన్న ఫిట్‌నెస్ కూడా ఒక కారణమని శ్రీనివాస్ తెలిపారు.

జగన్ క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని.. విద్యార్ధులకు చదువుతో పాటు క్రీడలను తప్పనిసరి చేసేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో ఎంతోమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారంటే.. వారిలో ఫిజికల్, మెంటర్ ఫిట్‌నెస్ లేకపోవడం కూడా ఒక కారణమన్నారు.

అందుకే పాఠశాల స్ధాయి నుంచే విద్యార్ధులను క్రీడల్లో పాల్గొనేలా ప్రొత్సహించాలని మంత్రి తెలిపారు. మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఒలింపిక్ రన్ ద్వారా క్రీడలపై మరింత ఆసక్తిని పెంపొందిస్తామన్నారు.

క్రీడల ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతుందని పేర్కొన్నారు. తాను కూడా క్రీడాకారునిగా ఉంటూ ఉద్యోగం సంపాదించానని ధర్మాన గుర్తు చేసుకున్నారు. క్రీడలను ప్రొత్సహించే వ్యక్తి సీఎంగా ఉండటం మన అదృష్టమన్నారు. తమ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా అవసరమైన సహకారం అందిస్తుందని కృష్ణదాస్ స్పష్టం చేశారు.