Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీకి.. తెలుగు విద్యార్థిని ప్రశ్న.. ఏపీ ప్రభుత్వం అభినందన

‘పరీక్షా పే చర్చ' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవి ఎంపికై తన సందేహాలను వీడియో ద్వారా ప్రధాని ముందుంచింది.

Minister audimulapu suresh praises student who questions PM Modi on pariksha pe charcha
Author
Hyderabad, First Published Apr 9, 2021, 1:52 PM IST

పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీని ఓ తెలుగు విద్యార్థి ఓ ప్రశ్న అడిగింది. కాగా... ఆమె ధైర్యాన్ని మెచ్చిన ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. సదరు విద్యార్థినిని అభినందించారు.

కాగా... కొద్దిరోజుల క్రితం ‘పరీక్షా పే చర్చ' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవి ఎంపికై తన సందేహాలను వీడియో ద్వారా ప్రధాని ముందుంచింది. 'కరోనా ప్రభావంతో ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పరీక్షలు దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నాం. భయాన్ని వీడి ఏకాగ్రతతో పరీక్షలు రాసేందుకు ఉపాయం చెప్పండి' అని పల్లవి కోరింది.

ఇందుకు ప్రధాని 'పరీక్షలంటే భయపడవద్దు. మనల్ని మెరుగుపరచుకునేందుకు ఉపకరించేవిగా వాటిని చూడండి. కొన్నిసార్లు సామాజిక, కుటుంబ వాతావరణం కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఒత్తిడి లేకపోతే విద్యార్థులు పరీక్షలను భారంగా భావించరు. కష్టంగా అనిపించిన సబ్జెక్టుల నుంచి దూరంగా పారిపోవద్దు. నా వరకు నేను కష్టమైన పనిని ఉదయాన్నే చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. సులభమైన పనుల్ని రాత్రి పొద్దుపోయాక చేస్తుంటాను'' అని సమాధానమిచ్చారు.


తాజాగా సదరు విద్యార్థిని ఏపీ ప్రభుత్వం అభినందించింది. ఆమె ఉన్నత విద్యకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. గురువారం మార్కాపురంలోని తన నివాసంలో మంత్రి పల్లవిని సత్కరించారు. తల్లిదండ్రులు మోహనరావు, సంపూర్ణ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన పల్లవితో ఆయన మాట్లాడారు. ‘‘ఎంతో ధైర్యంగా ప్రశ్న అడిగావు.. ప్రధాని సమాధానం ఇచ్చారు. శభాష్‌ పల్లవి..’’ అంటూ ప్రశంసించారు.


ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భవిష్యత్తులో ‘‘నీ లక్ష్యం ఏమిటి’’ అని పల్లవిని మంత్రి.. ప్రశ్నించగా తాను డాక్టర్‌ కావాలనుకుంటున్నట్లు చెప్పడంతో ప్రభుత్వం తరపున ఉన్నత చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పల్లవి ఆన్‌లైన్‌ విద్యాభ్యాసానికి తమ ఇంట్లో టీవీ లేదని చెప్పగా మంత్రి అప్పటికప్పుడు టీవీతో పాటు డిక్షనరీని  కూడా బహూకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios