పోలవరం ప్రాజెక్టుపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఎంత మేర దెబ్బతిన్నదో ఇంకా నిర్దారించలేదని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఎంత మేర దెబ్బతిన్నదో ఇంకా నిర్దారించలేదని చెప్పారు. ఇందుకు ఇంకా సమయం పడుతుందని నేషనల్ హైడ్రో పవర్ కార్పోరేషన్ సంస్థ చెప్పిందని తెలిపారు. అప్పటి వరకు పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగదని వెల్లడించారు. రాష్ట్రంలో పోలవరం సహా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ కోరుకుంటుందని విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి టీడీపీ కారణం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ పోలవరంను నాశనం చేయాలని చూసిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఎందుకు అనుమతించారని పీపీఏను, సీడబ్ల్యూసీని, కేంద్రాన్ని అడుగుతామని మంత్రి అంటి రాంబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయితే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చంద్రబాబు హయాంలో ఎందుకు టేకప్ చేశారని ప్రశ్నించారు. సంగం బ్యారేజ్ చంద్రబాబు రెక్కల కష్టమని టీడీపీ సిగ్గు లేకుండా మాట్లాడుతోందని మండిపడ్డారు.
నెల్లూరు జిల్లాలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శంకుస్థాపన చేసిన రెండు బ్యారేజీలు నిన్న ప్రారంభించామని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక రెండు బ్యారేజీలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో రెండు ప్రాజెక్టులకు మొత్తం రూ. 610 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్పారు. చంద్రబాబు హయాంలో కేవలం రూ. 157 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.
14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా చేపట్టలేదని అన్నారు. ప్రాజెక్టులపై టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని.. చేయని పనులను చేసినట్టుగా చెప్పుకుంటుందని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
