న్యాయపోరాటం చేస్తాం.. కృష్ణా జలాల్లో ఏపీకి రావాల్సిన ప్రతి నీటి బొట్టును తీసుకుంటాం: మంత్రి అంబటి
కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. మంత్రి అంబటి రాంబాబు శనివారం రోజున విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నది నీటి పంపకాల విషయంలో దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయిని చెప్పారు. గతంలో కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసిందని అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో తుది నివేదిక ఇచ్చిందని చెప్పారు. అయితే ఏపీకి నష్టం జరుగుతుందని సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేడయం జరిగిందని.. అప్పుడు సుప్రీం కోర్టు స్టే విధించిందని చెప్పారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు ఇప్పటికే విధివిధానాలు ఉన్నాయని అన్నారు. అయితే కొత్త విధివిధానాలు అప్పగించడం చట్టవిరుద్దమని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారని తెలిపారు. రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని తాము ఒప్పుకోమని చెప్పారు. న్యాయ పోరాటానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగితే సహించమని చెప్పారు. ఏపీకి రావాల్సిన నీటి వాటాను వదులుకోమని తెలిపారు. ఏపీకి రావాల్సిన ప్రతి నీటి బొట్టును తీసుకుంటామని చెప్పారు.
తెలుగుదేశం అవినీతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాటా ఉందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్‌కు ఉంది చిత్తశుద్ది కాదని.. చెత్త శుద్ది అని సెటైర్లు వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ లైట్లు ఎప్పుడో ఆరిపోయాయని విమర్శించారు. చంద్రబాబు ఎంతో మంది లైట్లు ఆర్పారని ఆరోపణలు చేశారు.