టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘‘యువగళం’’ పాదయాత్ర రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానుండటంతో మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు . ఆగిపోయిన హాస్య భరిత చిత్రం మళ్లీ ప్రారంభం కాబోతోందన్నారు. అసలు పుత్రుడు చేసే కామెడీ రేపటి నుంచి చూడొచ్చంటూ రాంబాబు సెటైర్లు వేశారు. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘‘యువగళం’’ పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ రావడంతో లోకేష్ రేపటి నుంచి తన యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. దీనిపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. 

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగిపోయిన హాస్య భరిత చిత్రం మళ్లీ ప్రారంభం కాబోతోందన్నారు. దానిని క్యామిడీ గళం అంటారో ఏమంటారోనంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు లోకేశ్ ఈ యాత్రను ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు ఆపేశారో.. మళ్లీ ఎందుకు మొదలుపెడుతున్నారో తెలియడం లేదన్నారు. అసలు పుత్రుడు చేసే కామెడీ రేపటి నుంచి చూడొచ్చంటూ రాంబాబు సెటైర్లు వేశారు. 

అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధులు నువ్వు ఎందుకు ప్రచారానికి రావడం లేదని పవన్‌ను ప్రశ్నించాలన్నారు. చంద్రబాబుకు నీ అభ్యర్ధులకు సపోర్ట్ చేస్తున్నారా అని రాంబాబు నిలదీశారు. ఏపీ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరని .. అక్కడి రాజకీయాల ప్రభావం ఆంధ్రాపై వుండదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా సత్సంబంధాలు వుంటాయని రాంబాబు వెల్లడించారు. 

ALso Read: పవన్ శ్వాస పీల్చేది.. వదిలేది చంద్రబాబు కోసమే , డబ్బులు లేవంటూ ఛార్టెట్ ఫ్లైట్స్‌లో జర్నీలా : పేర్ని నాని

పవన్ కల్యాణ్ వారాహికి చంద్రబాబు తెలంగాణలో లైసెన్స్ ఇచ్చినట్లు లేరంటూ మంత్రి సెటైర్లు వేశారు. కనీసం జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన చోటికి కూడా వారాహి వెళ్లడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖలో మత్స్యకారులకు ఆయన పంచింది ప్యాకేజీ సొమ్మేనని రాంబాబు ఆరోపించారు. అది ప్యాకేజ్ సొమ్మని.. ఇన్‌కం ట్యాక్స్ ఎగ్గొట్టిన సొమ్మని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూట్‌కేసులో డబ్బులు లెక్కపెట్టుకోవడం, స్లిప్పులోది చదవడం తప్పించి పవన్‌కి సొంత ఆలోచన లేదని మంత్రి దుయ్యబట్టారు. 

పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటూ వుంటారని.. ఆయనను నమ్ముకుంటే కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లేనని రాంబాబు చెప్పారు. నువ్వు రాజకీయ నాయకుడివా, రాజకీయ నటుడివా.. రాజకీయ బ్రోకర్‌వా.. తెలంగాణలో చంద్రబాబు మద్ధతు ఎవరికీ, నీ మద్ధతు ఎవరికి అని రాంబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కేవలం ప్యాకేజీలు తీసుకుని మహత్తర నాటకాలు ఆడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.