Asianet News TeluguAsianet News Telugu

atmakur bypoll: టీడీపీ పోటీచేయకపోయినా.. కుట్రలు ఆగలేదు, మద్యాన్ని వదలడం లేదు: అంబటి

ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా కుట్రలు మాత్రం ఆగలేదని మంత్రి మండిపడ్డారు. 
 

minister ambati rambabu reacts on ysrcp victory in atmakur bypoll
Author
Amaravati, First Published Jun 26, 2022, 3:36 PM IST

ఆత్మకూరులో (atmakur bypoll) ఇంత భారీ మెజారిటీ రావడం గొప్ప విజయమన్నారు వైసీపీ నేత (ysrcp), మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu). ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలపై ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ (tdp) లేకపోయినా చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ (bjp) డిపాజిట్ కూడా కోల్పోయిందని అంబటి గుర్తుచేశారు. మద్యంపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతీ ఎన్నికకూ వైసీపీ ఓటింగ్ శాతం పెంచుకుంటూ పోతోందని అంబటి రాంబాబు అన్నారు. మద్యంలో విషపూరిత పదార్ధాలు లేవని గతంలోనే తేలిందని ఆయన గుర్తుచేశారు. విషపూరిత ప్రచారం కోసం టీడీపీ మద్యాన్ని కూడా వాడుకుంటోందని అంబటి మండిపడ్డారు. 

ఇకపోతే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక‌లో వైసీపీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కాగా.. తొలి రౌండ్ నుంచి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. పోస్టల్ బ్యాలెట్‌తో సహా 20 రౌండ్‌లలో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన విక్రమ్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి భరత్ కుమార్ (బీజేపీ)‌పై 82, 888 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. మరికాసేపట్లో అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 

విక్రమ్ రెడ్డికి 1,02,241 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌‌కు 19,353 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఇక, నోటాకు 4,182 ఓట్లు పోల్‌ కావడం విశేషం. మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీ లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో ఆ టార్గెట్‌ను చేరుకోలేకపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఆత్మకూరు ఉపఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతోనే విజయం సాధించినట్టుగా చెప్పారు. గౌతమ్ రెడ్డిపై అభిమానంతోనే భారీగా ఓట్లు వచ్చాయని తెలిపారు. ఈ విజయంతో తనపై బాధ్యత పెరిగిందన్నారు. ఓటమి వల్లే బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తుందని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా గౌతమ్‌ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు. మేకపాటి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇచ్చినందున.. గత సంప్రదాయాన్ని పాటించి ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios