ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ప్రధాన అనుచరుడు ఆదినారాయణ షాక్ ఇచ్చాడు. కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆదినారాయణ టిడిపిలో చేరారు. 

సత్తెనపల్లి : ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వైసిపిని ఈసారి ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న టిడిపి ముందుగా ఆ పార్టీలోని కీలక నాయకులను టార్గెట్ చేసింది. ఇలా ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబును ఎదుర్కొనేందుకు సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు టిడిపి చీఫ్ చంద్రబాబు. దీంతో రంగంలోకి దిగిన కన్నా తాజాగా అంబటికి షాకిచ్చారు. 

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు బత్తుల ఆదినారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. సత్తెనపల్లి టిడిపి ఇచార్జ్ కన్నా లక్ష్మీనారాయణ చేతులమీదుగా ఆదినారాయణ టిడిప కండువా కప్పుకున్నారు. న్యాయవాదిగా మంచి పేరున్న ఆదినారాయణ సత్తెనపల్లి వైసిపి లీగల్ సెల్ అధ్యక్షుడిగా వున్నారు. అంతేకాదు కాపు సామాజికవర్గానికి చెందిన ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. అన్నింటికంటే ముఖ్యంగా మంత్రి అంబటికి ఆదినారాయణ ప్రధాన అనుచరుడు. అలాంటిది ఆయనే టిడిపిలో తీర్థం పుచ్చుకోవడం సత్తెనపల్లి వైసిపికి ఎదురుదెబ్బేనని పొలిటికల్ టాక్. 

 ఈ సందర్భంగా టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ప్రముఖ న్యాయవాది, వైసిపి నాయకుడు ఆదినారాయణ వైసిపిని వీడి టిడిపిలో చేరడం శుభ పరిణామమని అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి ఆదినారాయణ ఆసక్తి చూపించారని... అందువల్లే ఆయనను టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించామని తెలిపారు. ఇలా న్యాయవాదులు, మేధావులు కలిసికట్టుగా పనిచేసి వైసిపి దుర్మార్గ పాలనను అంతంచేసి సుపరిపాలనను అందించే టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. 

Read More కన్నా...మా అన్నే, ఏ పార్టీలో ఉంటారో తెలియదు: అంబటి సెటైర్లు

బిజెపిని వీడి టిడిపిలో చేరినతర్వాత కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్ గా మరింత యాక్టివ్ అయ్యారు. ఇక ఆయనకు చంద్రబాబు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఎంతమంది వ్యతిరేకించినా సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో మరింత దూకుడు పెంచిన కన్నా వైసిపిలో అసంతృప్త నేతలను ప్రసన్నం చేసుకుంటున్నాడు. ఇలా వలసలను ప్రోత్సహించి మంత్రి అంబటిని దెబ్బతీయడమే కాదు టిడిపిని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మంత్రి అనుచరుడు ఆదినారాయణను టిడిపిలో చేర్చుకున్నారు.