టీడీపీ హయాంలో ఘోరమైన తప్పిదాలు.. రూ. 400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది: మంత్రి అంబటి రాంబాబు

టీడీపీ తెలివి తక్కువతనంతోనే లోయర్ కాపర్ డ్యామ్ మునిగిపోయిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కాపర్ డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారని అన్నారు. ఇది నిజమో కాదో టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

minister ambati rambabu Fires on TDP Over Polavaram Project

టీడీపీ తెలివి తక్కువతనంతోనే లోయర్ కాపర్ డ్యామ్ మునిగిపోయిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కాపర్ డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారని అన్నారు. ఇది నిజమో కాదో టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పోలవరంపై టీడీపీ చెబుతున్న మాటలు అవాస్తవం అని అన్నారు. స్పిల్ వేను ఆపేసి డయాఫ్రమ్ ఎలా నిర్మించారని మంత్రి ప్రశ్నించారు.  టీడీపీ హయాంలో ఘోరమైన తప్పిదాలు చేశారని ఆరోపించారు. వైసీపీ సర్కార్ వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

వరదలతో ఢయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్పారు. రూ. 400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని విమర్శించారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత స్పిల్ వేను, అప్రోచ్ చానల్‌ను పూర్తి చేశామని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే.. స్పిల్ వే ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు పెద్ద మొత్తంలో వరద వచ్చిన ప్రాజెక్టుకు నష్టం కలగకుండా కాపాడారని చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారులను అభినందిస్తున్నట్టుగా తెలిపారు. 

తనకు డయా ఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ అంటే తెలియదని.. కానీ నాలెడ్జ్ ఉందని చెప్పారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని తెలుసుకుంటున్నానని తెలిపారు. దేశంలో ఎంతో మంది  ఆరోగ్య శాఖ మంత్రులుగా పనిచేశారని.. వారికి ఆపరేషన్ చేయడం వచ్చా అని ప్రశ్నించారు. 2018లో పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో దేవినేని ఉమా సమాధానం చెప్పాలన్నారు. 

పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరుగుతుందనేది అవాస్తవమని చెప్పారు. అన్ని అంశాలు చర్చించిన తర్వాత కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిందన్నారు. ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ఏడు మండలాలను ఏపీలో కలిపారని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టడానికే చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios