మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లిలో మా దెబ్బ ఎలా వుంటుందో కన్నాకు రుచి చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన ఊడుత ఊపులకు తాను భయపడే రకం కాదన్నారు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లిలో తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కన్నా అనే వస్తాదును పంపి చంద్రబాబు తనను ఓడించడానికి చూస్తున్నాడన్నారు. పెదకూరపాడు, గుంటూరు కుస్తీ పోటీలో కన్నా గెలిచాడట.. ఇప్పుడు సత్తెనపల్లి వచ్చి తనను నలిపేస్తాడట అంటూ అంబటి సెటైర్లు వేశారు. నన్నేదో ఓడిస్తాడని కన్నాను రంగంలోకి దించారని.. ఆయన ఊడుత ఊపులకు తాను భయపడే రకం కాదన్నారు. తాను వైఎస్ శిష్యుడినని.. తాను రంగంలో వుండి వుంటే రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో కన్నా మంత్రిగా వుండేవాడు కాదన్నారు. సత్తెనపల్లిలో మా దెబ్బ ఎలా వుంటుందో కన్నాకు రుచి చూపిస్తానని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
కాగా.. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత వున్న సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి కోసం కోడెలశివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు , శౌరయ్య, మల్లిబాబు పోటీ పడ్డారు. అయితే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైపే టీడీపీ నాయకత్వం మొగ్గుచూపింది. 2014, 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కోడెల శివప్రసాదరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. 2014లో సత్తెనపల్లి నుండి కోడెల శివప్రసాదరావు విజయం సాధించి నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.
Also Read: అంబటిపై పోటీకి కన్నా: సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీగా మాజీ మంత్రి నియామకం
అయితే 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జీ లేరు. దీంతో ఈ పదవి కోసం నేతలు పోటీ పడ్డారు. అయితే ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి ఇంచార్జీగా నియమించింది హైకమాండ్.
