Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మారెడ్డిది ఫ్యాక్షన్ మనస్తత్వం.. అందుకే మాచర్లకి ఇన్‌ఛార్జ్‌గా, ఎవ్వరినీ వదిలేది లేదు : మంత్రి అంబటి

మాచర్లలో అశాంతి సృష్టించేందుకే బ్రహ్మారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు పంపారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని రాంబాబు హెచ్చరించారు. 

minister ambati rambabu fires on tdp chief chandrababu naidu over macherla violence
Author
First Published Dec 17, 2022, 8:04 PM IST

పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదేం కర్మ స్లోగన్‌తో ప్రజలను తెలుగుదేశం రెచ్చగొడుతుందన్నారు. బ్రహ్మారెడ్డిది ఫ్యాక్షన్ మనస్తత్వమన్నారు. మాచర్లలో అశాంతి సృష్టించేందుకు బ్రహ్మారెడ్డిని చంద్రబాబు పంపారని అంబటి రాంబాబు ఆరోపించారు. తాజాగా మాచర్లలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని .. ఇలాంటి చర్యలపై ప్రభుత్వం ఎవరినీ వదలదని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని రాంబాబు హెచ్చరించారు. 

అంతకుముందు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా మాచర్ల హింసపై స్పందించారు. రాజకీయాల్లో గొడవలు ఇదే తొలిసారి కాదని.. చివరిసారి కూడా కాదన్నారు. 75 ఏళ్ల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బట్టలూడదీసి కొడతానని రోజూ అంటున్నారని నాని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన మాటలను మాచర్లలో టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకుని వుంటారని కొడాలి నాని చురకలంటించారు. 

Also REad : మాచర్ల హింస.. 9 మందిపై హత్యాయత్నం కేసులు, ఏ1గా టీడీపీ నేత బ్రహ్మారెడ్డి

మరోవైపు.. మాచర్లలో హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అలాగే బ్రహ్మారెడ్డిని ఏ1గా చేర్చారు. రేషన్ డీలర్ చల్లా మోహన్ ఫిర్యాదుతో బ్రహ్మారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రహ్మారెడ్డి, బాబూఖాన్‌లు తమపై రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని చల్లా మోహన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరో రాళ్లు విసిరితే తమపై దాడి చేశారని ఆయన ఫిర్యాదులో చెప్పారు. 

మరో కేసులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిశోర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పార్టీ కార్యాలయంపై దాడి, కార్ల ధ్వంసం, అపార్ట్‌మెంట్‌లో చొరబడి చేసిన విధ్వంసాల కారణంగా తురక కిశోర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 10 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా తురక కిశోర్, ఏ2గా చల్లా మోహన్‌లను చేర్చారు. ఎర్రం అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios