సారాంశం

మన నీటిని సాధించుకోవడం కోసం పోలీస్ యాక్షన్ ద్వారా ప్రయత్నిస్తే టీడీపీ విమర్శిస్తోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. మా హక్కులను కాపాడుకోవడానికి వెళ్తే అది దండయాత్ర ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. జగన్ నాయకత్వంలో మన నీళ్ల కోసం పోరాడే ప్రయత్నం చేస్తున్నామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

తెలంగాణతో నాగార్జున సాగర్ వివాదంపై స్పందించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు. చంద్రబాబు రైతుల పాలిట ద్రోహిగా మిగిలిపోయారని.. జగన్ నాయకత్వంలో మన నీళ్ల కోసం పోరాడే ప్రయత్నం చేస్తున్నామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వల్లే ఏపీకి ఈ దుస్థితి తలెత్తిందని , నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. 

మన నీటిని సాధించుకోవడం కోసం పోలీస్ యాక్షన్ ద్వారా ప్రయత్నిస్తే టీడీపీ విమర్శిస్తోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. మా హక్కులను కాపాడుకోవడానికి వెళ్తే అది దండయాత్ర ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు.. ఆయనపై వున్న కేసుల వల్తే తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయాడని రాంబాబు మండిపడ్డారు. గతంలో కృష్ణా బోర్డు ఇండెంట్ ఇవ్వకుండానే తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నీటిని వాడుకుందని ఆయన ఆరోపించారు. 

Also Read: రైతులు రోడ్డెక్కినా మౌనం.. నీటి వాటాలు తెలంగాణ ఎన్నికలప్పుడే గుర్తొచ్చాయా : జగన్‌పై ధూళిపాళ్ల ఆగ్రహం

ఎల్లో మీడియా ఇష్టానుసారంగా కథనాలు ప్రచురిస్తోందని .. ఏపీకి ద్రోహం చేసే విధంగా ఎల్లో మీడియా కథనాలు వున్నాయని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్ధతు ఇవ్వకపోపయినా పర్వాలేదు కానీ ఇలాంటి తప్పుడు కథనాలు వద్దని ఆయన హితవు పలికారు. శ్రీశైలం ఏపీ ఆధీనంలో, నాగార్జున సాగర్‌ను తెలంగాణ ఆధీనంలో పెట్టారని మంత్రి చెప్పారు. చంద్రబాబు అసమర్ధత వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని అంబటి ఎద్దేవా చేశారు. ఏపీ నీటి హక్కులను చంద్రబాబు తెలంగాణకు పాదాక్రాంతం చేశారని దుయ్యబట్టారు. 

ఏపీకి రావాల్సిన నీటి వాటా గురించి జగన్ పోరాడారని అంబటి ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ నాగార్జున సాగర్ జలాలపై తప్పించి మిగిలిన అన్ని విషయాలు మాట్లాడారని మంత్రి ఎద్దేవా చేశారు. నీకు బ్యానర్ కట్టిన వ్యక్తిని కూడా నీవు నిలుపుకోలేకపోయావంటూ రాంబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు జనసేన పార్టీలో వున్నవారు కూడా తర్వాత వుండరని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆరోపించారు.