చంద్రబాబు అరెస్ట్ .. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలియదా : నారా బ్రాహ్మణికి అంబటి రాంబాబు కౌంటర్
నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలియదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను మోసం చేశారని మంత్రి వ్యాఖ్యానించారు.

నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలియదా అని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తును జనసేన కార్యకర్తలే అంగీకరించడం లేదన్నారు. పరామర్శకు వెళ్లి పవన్ పొత్తు కుదుర్చుకున్నారని అంబటి ఎద్దేవా చేశారు. పొత్తు నిర్ణయం పవన్ ఎప్పుడో తీసుకున్నారని.. బాబు, పవన్ కలిసి వస్తారని తాము ఎప్పుడో చెప్పామని రాంబాబు పేర్కొన్నారు.
అంతకుముందు మంత్రి రోజా కూడా బ్రాహ్మణిపై విమర్శలు చేశారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణిని రంగంలోకి దించారని.. తీరా చూస్తే ఈ అస్త్రం కూడా తుస్సుమందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవాన్ష్‌కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించొద్దని సెటైర్లు వేశారు. మా తాత ఇంత అవినీతిపరుడా అని దేవాన్ష్ అనుకుంటాని రోజా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ జైల్లో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపించారు. తనను నమ్మిన అభిమానులను పవన్ మోసం చేశారని దుయ్యబట్టారు.
పవన్ బతుకెంత.. పవన్ స్థాయి ఎంత అని రోజా ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రజల అభిమానంతో సీఎం అయ్యారని మంత్రి పేర్కొన్నారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి పవన్ అన్నారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ సీఎం జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. సోనియా గాంధీనే ఢీకొన్న దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని రోజా ప్రశ్నించారు. తన తల్లితని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ అన్నారు.
Also Read: బ్రహ్మాస్త్రం అనుకుని దించారు, దేవాన్ష్ కు చూపకండి : బ్రాహ్మణికి రోజా కౌంటర్
సీఎం జగన్ ఎంపీగా 5 లక్షలకు పైగా మెజార్టీ సాధించారని గుర్తుచేశారు. జగన్ ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ ఓడిపోయాడని రోజా దుయ్యబట్టారు. పవన్ మిగిలిన పార్టీ జెండాలు మోసే కూలీగా మారిపోయారని ఎద్దేవా చేశారు. తండ్రి అడుగుజాడల్లో జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. పవన్ తన స్థాయికి తగినట్లు మాట్లాడాలని రోజా హితవు పలికారు. అమిత్ షాకు కంప్లైంట్ చేస్తానంటూ పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ దేనిలోనైనా సక్సెస్ అయ్యారా అని ఆమె ప్రశ్నించారు. యుద్ధానికి సీఎం జగన్ ఎప్పుడూ రెడీగానే వుంటారని రోజా తెలిపారు.
కనీసం 10 చోట్లయినా పవన్‌కు అభ్యర్ధులు వున్నారా అని ఆమె ప్రశ్నించారు. సీఎం జగన్ సింహంలా సింగిల్‌గానే వస్తారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికినా వీరికి సిగ్గు లేదంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సానుభూతి డ్రామాలు ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు తప్పించుకున్నారని రోజా వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయకుండా వుంటారా అని ఆమె ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్‌తో అందరికీ అర్ధమైందన్నారు. బ్రాహ్మణి టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారని.. ఆమెకు రాజకీయంగా ఏమీ తెలియదని నిన్ననే అర్ధమైందని రోజా చురకలంటించారు.