తనపై పుంగనూరులో హత్యాయత్నం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. పుంగనూరులో చంద్రబాబుపై ఎలాంటి హత్యాయత్నం జరగలేదన్నారు. 

తనపై పుంగనూరులో హత్యాయత్నం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సమక్షంలో పోలీసులు, వైసీపీ శ్రేణులపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఒక కానిస్టేబుల్ కాళ్లు పోయాయని, దీనికి బాధ్యులు ఎవరు అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసు పెట్టకపోతే రాజ్యాంగం లేనట్లేనని ఆయన తేల్చిచెప్పారు. పుంగనూరులో చంద్రబాబుపై ఎలాంటి హత్యాయత్నం జరగలేదన్నారు. 

ప్రాజెక్ట్‌లపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారని , సెల్‌ఫోన్ కనిపెట్టిన ఆయనకు సెల్ఫీ తీసుకోవడం కష్టమవుతోందంటూ అంబటి సెటైర్లు వేశారు. వైఎస్ ప్రారంభించకపోతే పోలవరం ప్రాజెక్ట్ వుండేది కాదని, ఈ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు నాశనం చేశారని రాంబాబు ఆరోపించారు. ఏదో జరిగిపోతున్నట్లు రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని.. దోచుకుంది, దాచుకుంది చంద్రబాబేనని ఆయన ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తాము ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని మంత్రి తెలిపారు. అధికారంలో వున్నప్పుడు సీబీఐకి అనుమతి నిరాకరించిన వ్యక్తి.. ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం సిగ్గు చేటన్నారు. ముద్రగడను చంద్రబాబు హింసించారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: నన్ను చంపాలని చూశారు: పుంగనూరు ఘటనపై సీబీఐ విచారణకు బాబు డిమాండ్

అంతకుముందు విజయనగరంలో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. తనపై అంగళ్లులో జరిగిన ఘటనపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక ఎవరి కుట్ర ఉందో తేల్చాలన్నారు. మమ్మల్ని చంపి రాజకీయం చేయాలని భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శనకు తాను వెళ్తుండగా అంగళ్లు వద్ద వైఎస్ఆర్‌సీపీ నేతలు పథకం ప్రకారం అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.

ఈ విషయమై ఎన్‌ఎస్‌జీతో అధికారులు స్థానిక పోలీసులతో మాట్లాడారన్నారు. తన సీఎస్ఓ చిత్తూరు ఎస్పీతో కూడ మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దాడి చేస్తే తాను పారిపోవాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు పన్నాగం పన్నారన్నారు. తనపై వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు రాళ్లు వేసిన సమయంలో ఎన్‌ఎస్‌జీ సిబ్బంది అడ్డుగా నిలిచారన్నారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదన్నారు.