తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భూముల విలువపై ప్రస్తుతం చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పందించిన ఏపీ మంత్రి అమర్నాథ్.. విశాఖపట్నంలో ఎకరా స్థలం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనచ్చని అన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భూముల విలువపై ప్రస్తుతం చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ పడిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించడం.. ఈ కామెంట్స్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ సంగారెడ్డి సభలో ప్రస్తావించడంతో.. తెలుగు రాష్ట్రాల్లో భూముల విలువపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఏపీ భూముల విలువపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్ స్పందించారు. ఏపీలోని విశాఖపట్నంలో ఎకరా స్థలం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. హైదరాబాద్‌లో లేని రేట్లు విశాఖపట్నంలో ఉన్నాయని అన్నారు. 

కేసీఆర్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో తమకు తెలియదని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను తీసుకుని కేసీఆర్ చెబితే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలను కించపరచడం సరైనదని కాదని.. జాగ్రత్తగా మాట్లాడాలని కోరారు. ఇక, ఒక్కశాతం ఓటు లేని భాజపాతో కలిసి తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు ఏమీ సాధించలేరని విమర్శించారు. 

అసలేం జరిగిందంటే.. ఇటీవల చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ పడిపోయిందని అన్నారు. ఒక్కప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్మితే, తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనుక్కునే అవకాశం ఉండేదని.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో 50 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అభివృద్ది ఆగిపోవడంతో ఏపీలో భూముల విలువలు పడిపోయాయని అన్నారు. భూముల విలువ తగ్గి.. రిజిస్ట్రేషన్ విలువ పెరిగిందని అన్నారు. 

అయితే చంద్రబాబు చెప్పిన ఈ మాటలను తెలంగాణ సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన సభలో ప్రస్తావించారు. తెలంగాణలో ప్రస్తుతం భూమి బంగారం అయ్యిందన్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చని స్వయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు కొనుక్కోవచ్చని అనుకునేవారని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని అన్నారు. పటిష్ఠ నాయకుడు, నాయకత్వం ఉంటే అన్నీ సాధ్యమవుతాయని కేసీఆర్ అన్నారు.