విజయవాడ: కరోనా విఫయంలో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పైశాచిక ఆనందం పొందుతున్నాడని  డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య మంత్రి ఆళ్లనాని ఆరోపించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నారని... ప్రజారోగ్యం, రాష్ట్ర పరిస్థితి గురించి కాకుండా కేవలం రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు.

''సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. సీఎం అత్యంత సమర్థవంతంగా పాలనను సాగిస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో వుండగా ఒక్క డాక్టర్ ని కూడా నియమించలేదు. టిడిపి ప్రభుత్వవం జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను గాలికొదిలేసింది. 104,108 వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీని నిలిపేవేసి పేదలను బలిగొన్నారు'' అని మండిపడ్డారు. 

''ఇప్పటికైనా చంద్రబాబుకు బాధ్యతగా మెలగకపోతే ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ కార్యాలకలాపాలకు అడ్డుతగిలితే సహించబోం'' అని  మంత్రి హెచ్చరించారు. 

''దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా చేయని టెస్ట్ లు ఏపీలో చేస్తున్నాం.  ఇప్పటి వరకు 16లక్షల 43వేల 319 మందికి టెస్ట్ లు చేశాం, సంపూర్ణ ఆరోగ్యంతో 46,301 మందిని ఇంటికి పంపాం. ప్రతిరోజు 50వేల టెస్ట్ లు చేసే సామర్ధ్యాన్ని పెంచుకున్నాం. కేవలం ప్రతిరోజు టెస్టుల కోసమే రూ.5 కోట్లు వెచ్చిస్తున్నాం'' అని  వెల్లడించారు. 

''టెస్టుల సామర్ధ్యం బట్టే కేసులు పెరుగుతున్నాయి. ప్రతి జిల్లాకు కాల్ సెంటర్ పెట్టి ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్నాం. రాష్ట్రంలో కొవిడ్ ఆస్పత్రులను 138కి పెంచాం  కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పెంచాం'' అని మంత్రి ఆళ్ల నాని వివరించారు.