గుంటూరు: ఇంగ్లీషుమీడియం అంశంలో హైకోర్టు తీర్పును టిడిపి రాజకీయం చేస్తోందని...కోర్టు ప్రొసీడింగ్స్ ను రాజకీయాలకు వాడుకోవడం దారుణమని రాష్ర్ట విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. బడుగుబలహీనవర్గాలు ఉన్నత చదువులు చదువుకోకూడదా?  వారి అభ్యున్నతి టిడిపికి ఇష్టం లేదా?  అని ప్రశ్నించారు. పేదవిద్యార్దులకు ఇంగ్లీషు మీడియం అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తపన అని...సామాజిక సంఘసంస్కర్తగా ముఖ్యమంత్రి తీసుకున్న ఇంగ్లీషు మీడియం నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం వెలువడిన కోర్టు ఆదేశాలపై జడ్జిమెంట్ కాపీ చూశాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు సురేష్. 

''2020-21 విద్యాసంవత్సరం నుంచి అన్ని మేనేజ్ మెంట్లు కూడా సాంఘిక, గిరిజన, వెనకబడిన వర్గాల సంక్షేమం, మున్సిపాలిటి, మండలపరిషత్, జిల్లాపరిషత్ స్కూల్స్ అన్నింటిలో ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి రాష్ర్ట ప్రజలందరికి తెలుసు. దానికి అనుగుణంగా జిఓ నెంబర్ 85 ను విడుదల చేయడం జరిగింది'' అని గుర్తుచేశారు. 

 ''ఇంగ్లీషు మాధ్యమాన్ని ఈ విద్యసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని చెప్పి జిఓ విడుదల చేయడం జరిగింది. అంతకుముందు జిఓ 81 కూడా 1 నుంచి 8 వతరగతి అనుకున్నాం. కానీ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా కేవలం ప్రాథమిక స్దాయిలోనే పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చేర్పించాలన్న ప్రతిపాదనను  పరిగణలోనికి తీసుకుని జిఓ 85 ను విడుదల చేయడం జరిగింది'' అని పేర్కొన్నారు. 

''అయితే ఈరోజు రాష్ర్ట హైకోర్టు ఈ రెండు జిఓలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వడం, టిడిపి వాళ్లు దానికి మేం స్వాగతిస్తున్నాం అని చెప్పడం,విమర్శలు చేయడం చాలా భాధాకరం. ఎందుకంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్  ఎంతో దూరదృష్టితో,దార్శనికతతో,సామాజిక సంఘసంస్కర్తగా బడుగు బలహీన వర్గాల వారికి తరతరాలుగా ఆంగ్లబోధన అందని ద్రాక్షగా మిగిలిపోయిందని గుర్తించి వారికి ఇంగ్లీష్ ను దగ్గరచేయాలని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని తదనుగుణంగా అడుగులు వేశారు'' అని అన్నారు. 

''అయితే ఈ విషయంపై ఇవాళ  ఈ జడ్జిమెంట్ రావడం, టిడిపి నేతలు జడ్జిమెంట్ కాపీ రాకముందే కోర్టు ఏ అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారో తెలియకుండా ముఖ్యమంత్రి ,ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి బడగుబలహీన వర్గాలు ఇంగ్లీషు మీడియంలో చదవడం ఇష్టంలేదనే మాట మాత్రం వారి మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది'' అని ఆరోపించారు. 

''40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మొదట ఇంగ్లీషు మీడియం స్కూల్స్ వద్దని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకుని ఇంగ్లీషు మీడియం మేం కూడా ప్రవేశపెట్టామని చెప్పి మాట్లాడారు. తిరిగి ఈరోజు ఇంగ్లీషు మీడియంపై జిఓలు రద్దుచేస్తూ హైకోర్టు  ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని చెప్పడంలో వారి ఉద్దేశ్యం ఏంటో ఖచ్చితంగా ఈ రాష్ర్ట ప్రజలకు తెలియాలి. బడుగుబలహీన వర్గాలవారు ఇంగ్లీషు మీడియంలో చదువుకోకూడదా'' అని నిలదీశారు. 

''ఈరోజు కోర్టు జడ్జిమెంట్ ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం.  హైకోర్టు జడ్జిమెంట్ కాపీ మాకు అందలేదు. అన్ని ఛానల్స్ కూడా తెలుగు,ఆంగ్లమాధ్యమాలను ఎంపిక చేసుకునే హక్కు విద్యార్ధులకు ఉండాలని కోర్టు స్పష్టం చేసిందని స్క్రోలింగ్స్ చూడటం జరిగింది. దీనిపై నేను రాష్ట్ర ప్రజలకు తెలియచేయడం ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మీడియం ఎంపిక చేసుకోవాలనే హక్కు విద్యార్ధులకు, తల్లిదండ్రులకు నూటికి నూరు శాతం ఇచ్చారని తెలియచేస్తున్నాం'' అని అన్నారు. 

'' దానికి సాక్ష్యం  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్న దాదాపు 43,600 పేరెంట్ కమిటీలు తీర్మానాలు చేసి ఆ తీర్మానాల కాపీలను రాష్ర్టప్రభుత్వానికి పంపించి ఖచ్చితంగా 1 నుంచి ఆరోతరగతి వరకు మా పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదివాలి, గ్రామప్రాంతాలలో కూడా ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టాలని కోరారు. దీనిని సచివాలయం సాక్షిగా ప్రదర్సించారనేది ప్రజలు మరచిపోలేదు. దానిని బట్టి చూస్తే విశాఖలో 96శాతం,ప్రకాశం జిల్లాలో99.76 శాతంనెల్లూరులో 95, చిత్తూరు జిల్లాలో 99 శాతం,ప్రతిపక్షనేత చంద్రబాబు సొంతగ్రామం నారావారిపల్లెలోని స్కూళ్లు కూడా ఇంగ్లీషు మీడియం కోసం తీర్మానం చేశాయి'' అని అన్నారు.

''కడపలో 95.65, పశ్చిమగోదావరి 97 శాతం, శ్రీకాకుళం 92 శాతం ఇలా ప్రతి జిల్లాలో కూడా తీర్మానం చేసి ప్రతులు పంపించడం జరిగింది. వీటి ఆధారంగా ఖచ్చితంగా తల్లిదండ్రులకు పిల్లలను ఏ మీడియంలో చదివించాలనే హక్కును వారికిచ్చి వారు స్వచ్ఛంధంగా చేసిన తీర్మానాలను రాష్ర్ట ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోవడం జరిగింది.  అంతేకాదు ఎక్కడైతే ఇంకా ఎవరైనా తెలుగు మీడియంలో చదవాలని అనుకుంటున్నారో వారికి కూడా తెలుగుమీడియం స్కూల్స్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి ఇచ్చిన సూచన మేరకు కోర్టువారికి అఫిడవిట్ కూడా అందచేశాం.తదనుగుణంగా జిఓ ఎంఎస్ నెంబర్ 15 ఉత్తర్వులు జారీచేస్తూ ప్రతి మండలం లో కూడ తెలుగుమీడియం స్కూల్ ను ఏర్పాటుచేయడం జరుగుతుంది.ఆ స్కూల్ కు రావడానికి అయ్యే రవాణ ఖర్చులు కూడా ఇస్తామని చెప్పి జిఓ ద్వారా చెప్పాం'' అని తెలియజేశారు. 

''ఎక్కడైతే మైనర్ మీడియం ఉందో ఉర్దు, తమిళ, కన్నడ, ఒరియా భాషలలో చదువుకునేవారికోసం బోధనమాధ్యమంను కంటిన్యూ చేస్తూ ఈ జిఓ ను జారి చేశాం.మైనారిటీ భాషలలో ప్రాధమికవిద్యను బోధించేవిధంగా విద్యార్ధులు అభ్యసించే విధంగా చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ఎక్కడైతే ఇంగ్లీషుమీడియం స్కూల్స్ ప్రవేశపెడుతున్నామో అక్కడ కూడా తెలుగుభాష వికాసానికి రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడిఉందని తెలియచేస్తూ తెలుగు సబ్జెక్టును కంపల్సరీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాం. ఇన్ని చేస్తూ కూడా ఇంగ్లీషుమీడియం స్కూల్స్ ను ప్రవేశపెట్టే దిశలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ అన్నీ ప్రొసీజర్స్ ను ఫాలోచేస్తూ రాజ్యాంగబధ్దంగా ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తోంది'' అని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.