వైసీపీ అధినేత జగన్ పై  మంత్రి ఆదినారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ఊరపంది అని కూడా పేర్కొన్నారు. ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. జగన్ పై విరుచుకుపడ్డారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రస్తుతం ఏపీ లో అసెంబ్లీ  సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది.  అయితే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకుంటే అసెంబ్లీలో అడుగుపెడతామని వైపీపీ నేతలు పేర్కొన్నారు. తమ పార్టీ గుర్తుతో గెలిచి.. ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్లారంటూ జగన్ కూడా ఫిరాయింపు నేతలపై మండిపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేయాలని సవాలు విసిరారు.

దీనిపై మంత్రి ఆదినారాయణ స్పందించారు. విశాఖలో విజయమ్మ తన వల్లే ఓడిపోయిందని ఒప్పుకుంటే... జగన్‌ వల్ల మేం గెలిచామని ఒప్పుకుంటామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.‘మా వంశ చరిత్ర గురించి నీవు మాట్లాడితే నీ చరిత్ర వందసార్లు చెబుతా.. మేం ఊరకుక్కలమైతే.. నువ్వు ఊరపందివి’ అంటూ జగన్‌నై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ సీఎం కావడానికి తాము కూడా కృషి చేశామని, ఆ విషయం మర్చిపోవద్దని ఆదినారాయణరెడ్డి సూచించారు. ఎవరి చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసునని, వైసీపీ పెట్టిన నాటి చరిత్ర ఏమిటో చెబితే పారిపోతావని మంత్రి జగన్‌ను హెచ్చరిస్తూ అన్నారు.
 
తన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జగన్ ఇంకా పుట్టలేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా నీ వద్దకు వచ్చానని, ఆ రోజు ఎమ్మెల్యేల ఫిరాయింపులు గుర్తులేదా? అని జగన్‌ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. పార్టీ మారినందుకు తనకు రూ. 20 కోట్లు ఇచ్చారని విమర్శలు చేస్తున్నారని, గతంలో నీ వద్దకు (జగన్) వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చావో చెప్పాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.