విశాఖ జిల్లా పాడేరు మండలం చింతపల్లి వద్ద ఆదివారం కరెంట్ స్తంభాన్ని ఆటో ఢీకొనడంతో ఐదుగురు మరణించిన ఘటనకు కారణం పాల ప్యాకెట్‌గా తెలుస్తోంది. చెరువూరుకు చెందిన వంతాల కృష్ణారావు గత కొంతకాలంగా ఆటో నడుపుతున్నాడు.

కోరుకొండలో ఆదివారం జరిగిన సంతకు వచ్చిన కృష్ణారావు పాలప్యాకెట్ కొని.. ఆటో స్టీరింగ్ వద్ద పెట్టుకున్నాడు. ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని చెరువూరికి సమీపంలోని దిగువ ప్రాంతానికి వెళుతుండగా పాలప్యాకెట్ ఆటో స్టీరింగ్ నుంచి జారీ కాళ్లపై పడింది.

దీంతో ప్యాకెట్ తీసి పైన పెట్టే క్రమంలో ఆటో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు కొందరు చెబుతున్నారు. మండలంలోని అన్నవరం రహదారి నుంచి చెరువూరు వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర 150 విద్యుత్ స్తంభాలున్నాయి.

ఇవన్నీ ఇనుప స్తంభాలు కావడంతో పాటు సింగిల్ లైన్ విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రమాద సమయంలో ఆటో విద్యుత్ స్తంభాన్ని స్వల్పంగా ఢీకొట్టినప్పటికీ విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడటంతో షాక్‌కు గురై ఐదుగురు మరణించగా, ఆరుగురు తీవ్ర గాయాల పాలైనట్లు స్థానికులు చెబుతున్నారు.