హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో వున్న వైసిపి ఎమ్మెల్సీ అనంత్ బాబు ప్లెక్సీలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దర్శనమివ్వడం వివాదంగా మారుతోంది. 

అమరావతి: వైసిపి సర్కార్ అధికారికంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇటీవల తన డ్రైవర్ ను మర్డర్ చేసి జైలుపాలైన ఎమ్మెల్సీ అనంత్ బాబు ప్లెక్సీలు దర్శనమివ్వడం వివాదంగా మారుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటలో అనంత్ బాబు ప్లెక్సీల ఏర్పాటే కాదు వైసిపి కార్యకర్తల ఊరేగింపులు, పాలాభిషేకాలు కూడా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకురావడం వివాదానికి దారితీస్తోంది. తాజాగా అనంత్ బాబు ప్లెక్సీకి పాలాభిషేకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. 

''దళిత యువకుడు సుబ్రహ్మ‌ణ్యంని అత్యంత కిరాతకంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకి పాలాభిషేకం చేయించారు సిఎం జగన్ రెడ్డి. జైల్లో సకల సౌకర్యాలు, బయట ఫ్లెక్సీల‌తో ఊరేగింపులు చూస్తుంటే దళితులపై సాగుతున్న దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది'' అని లోకేష్ ఆరోపించారు.

Video

''దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో ద‌ళిత‌యువ‌కుడ్ని అతి కిరాత‌కంగా చంపిన అనంత‌బాబుని హీరోగా కీర్తిస్తూ వైసీపీ ఊరేగింపు నిర్వ‌హించ‌డం చూశాక‌, ఈ ప్ర‌భుత్వంలో నిందితుల‌కు ర‌క్ష‌, బాధితుల‌కు శిక్షేనని మరోసారి రుజువైంది. దళితుల్ని దారుణంగా చంపే వాళ్లకి ప్రమోషన్లే తప్ప సస్పెన్షన్లు ఉండవని జ‌గ‌న్‌రెడ్డి వైసీపీ లీడ‌ర్ల నుంచి కేడ‌ర్ వ‌ర‌కూ భ‌రోసా ఇస్తున్నారు'' అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. 

ఇక ఇప్పటికే డ్రైవర్ హత్యకేసులో జైల్లో వున్న అనంతబాబును వైసిపి అదిష్టానం సస్పెండ్ చేసింది. అయినప్పటికి అతడి ప్లెక్సీలు వైసిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యాక్రమంలో కనిపించడం... వైసిపి శ్రేణులు పూలు, పాలతో అభిషేకిస్తూ ఊరేగించడంపై వివాదంగా మారుతోంది.

ఇక మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్నితానే హత్య చేశానని పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అంగీకరించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఇటీవల వెల్లడించారు. ప్రాథమిక విచారణ అనంత బాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి ప్రాథమిక దర్యాప్తులో ఆయనను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టు ఆదేశాలతో, రిమాండ్ కు పంపించామని తెలిపారు.