ఓ స్థలం విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళపై వైసిపి నాయకుడొకరు హత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ అమానుష ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు: ఓ స్థలం విషయంలో వివాదం చెలరేగి మహిళపై వైసిపి (ysrcp) నాయకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం నెల్లూరు జిల్లా (nellore district) కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కుమ్మరకొండూరు గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు చల్లా మహేష్ కు చల్లా సుభరత్నమ్మతో ఓ స్థలం విషయంలో గతకొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇరువురు స్థలం మాదంటే మాదని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ కేసు కోర్టులో పెండింగ్ లో వుంది.
అయితే కోర్టు తీర్పుతో పనిలేకుండా ఆ స్థలాన్ని దక్కించుకోడానికి మహేష్ దౌర్జన్యానికి దిగాడు. గురువారం అర్థరాత్రి 2గంటల సమయంలో జేసిబితో వివాదాస్పద స్థలాన్ని చదును చేయించడం ప్రారంభించాడు మహేష్. విషయం తెలిసి సుభరత్నమ్మకు అక్కడికి చేరుకుని ఆ పనులను అడ్డుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ ఆమెను కిందపడేసి పీకమీద కాలుపెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి బారినుండి ఎలాగోలా ఆమె ప్రాణాలతో భయటపడింది.
మహిళపై ఇలా అమానుషంగా ప్రవర్తించిన వైసిపి నాయకుడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. వివాదంలో వున్న భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాన్ని అడ్డుకున్న సుభరత్నమ్మపై వైసీపీ నేత మహేష్ దాడిని టిడిపి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా? అని అచ్చెన్న ప్రశ్నించారు.
''ఫ్యాక్షన్ మనస్తత్వమే వైసీపీ సిద్ధాంతం. దాడులు, హత్యలు, దోచుకోవడం, కబ్జాలు, దోపిడీలు చేయడమే వైసీపీ నాయకుల ప్రథమ కర్తవ్యం. నేడు ఏపీ దేశంలో మహిళలపై భౌతిక దాడుల్లో 1వ స్థానం, లైంగిక వేధింపుల్లో 3వ స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణం'' అని ఆరోపించారు.
''మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చి వారికి మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి నేడు ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారు? మూడేళ్లల్లో వైసీపీ నేతలు దాదాపు 1500 మంది మహిళలపై దాడులు చేసారు. అయినా ఇంతవరకు ఒక్క వైసీపీ నేతను అరెస్ట్ చేసిన ధాఖలాలు ఉన్నాయా?'' అని అడిగారు.
''తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి సమీపంలో మహిళపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వైసీపీ నాయకులు అధికారమదంతో అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ మహిళలపై అక్రమాలకు పాల్పడటానికి కారణం జగన్ రెడ్డి కాదా?'' అంటూ అచ్చెన్న మండిపడ్డారు.
వైసిపి నాయకుడు మహేష్ దాడిచేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధిత మహిళ సుభరత్నమ్మ కావలి హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఆమెకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని... దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు.
ఇదిలావుంటే అక్రమంగా మట్టితవ్వకాలు జరుపుతుంటే అడ్డుకోడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారిపై జేసిబితో దాడిచేసిన ఘటన కృష్ణా జిల్లాలో గుడివాడలో చోటుచేసుకుంది. అయితే అధికార పార్టీ అండదండలతోనే ఆర్ఐపై మట్టిమాఫియా దాడి చేసినట్లు ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోని గుడివాడలో అన్ని అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని... రెవిన్యూ ఉద్యోగి పై కూడా గడ్డం గ్యాంగ్ దాడిని పాల్పడినట్లు ఆరోపిస్తోంది. ఈ దాడిని టీడీపీ ఖండిస్తోందని... ఉద్యోగ సంఘాలకు అండగా ఉంటామని టిడిపి నాయకులు తెలిపారు.
