ఇటీవల ఓ మానసిక వికలాంగురాలిపై హాస్పిటల్ లో బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మురువకముందే మరో మహిళ హాస్పిటల్ నుండి కనిపించకుండా పోయిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడ: మొన్న ప్రభుత్వ హాస్పిటల్ లోని మానసిక వికలాంగురాలిపై అత్యాచారం... నిన్న(మంగళవారం) తిరుపతి రుయా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో కొడుకు మృతదేహాన్ని కన్నతండ్రే బైక్ పై తీసుకెళ్ళిన ఘటనలు వెలుగుచూసాయి. ఈ ఘటనల గురించి మరిచిపోకముందే తాజాగా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ కనిపించకుండా పోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వాంబే కాలనీకి చెందిన సయ్యద్ హసీనా (40) మానసిక సమస్యతో బాధపడుతోంది. దీంతో కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే హాస్పిటల్ సిబ్బంది ఏమరపాటుగా వ్యవహరించడంతో హసీనా అదృశ్యమయ్యింది. ఇలా చికిత్స పొందుతున్న మహిళ హాస్పిటల్ నుండి ఆమె బయటకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

హాస్పిటల్ చుట్టుపక్కల వెతికినా హసీనా ఆఛూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చేపట్టారు. ఎస్సై దుర్గాదేవి, సత్యనారాయణపురం సీఐ బాలమురళికృష్ణ తమ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. హాస్పిటల్ తో పాటు సమీపంలోని సిసి పుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టారు. 

అదృశ్యమైన మహిళకు 20ఏళ్ళ క్రితమే వివాహమవగా ముగ్గురు పిల్లులున్నారు. మానసిక సమస్యతో బాధపడుతున్నా ఆమె పిల్లలు, భర్త కళ్లముందే వుండేది... కానీ ఇప్పుడు ఆమె కనిపించకుండా పోవడంతో ఈ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. 

ఇటీవల విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోనే మానసిక వికలాంగురాలిపై అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సకాలంలో స్పందించని ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండయ్యారు. విధుల్లో అలసత్వం వహించిన సిఐ హనీష్‌, ఎస్సై శ్రీనివాసరావులపై సిపి క్రాంతి రాణా టాటా చర్యలు తీసుకున్నారు. 

దీంతో తాజాగా మానసిక సమస్యతో బాధపడుతున్న హసీనా అదృశ్యంపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకముందే ఆమె ఆఛూకీ కనుక్కునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. విజయవాడ పట్టణంలోనిఅన్ని పోలీస్ స్టేషన్లను సమాచారం అందించి అలెర్ట్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లో మహిళను సురక్షితంగా కుటుంబసభ్యుల వద్దకు చేర్చేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. 

ఇదిలావుంటే విజయవాడ ప్రభుత్వాస్పత్రి అత్యాచారం ఘటనను రాజకీయ పార్టీలో తమ లబ్ది కోసం వాడుకుంటున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ శ్రేణులు అడ్డుకుని గొడవకు దిగారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు మహిళ కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

అయితే చంద్రబాబుకు, తనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బొండా ఉమా స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వివకాలాంగురాలికి 30 గంటలకు నరకం చూపించారని అన్నారు. చంద్రబాబు నాయుడు బాధితురాలిని పరామర్శించేందుకు వస్తున్నారని తెలిసే ప్రభుత్వం నిద్ర లేచిందన్నారు. తాము వస్తున్నప్పుడే వాసిరెడ్డి పద్మ వచ్చారని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరితే బెదిరిస్తారా అని ప్రశ్నించారు. న్యాయం అడిగిన వారిని వాసిరెడ్డి పద్మ చేయి ఎత్తి కొట్టబోయారని బోండా ఆరోపించారు.