అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుందితన ప్రేమను కాదందనే అక్కసుతో ఓ యువకుడు ఓ యువతి కుటుంబంలో చిచ్చు రేపాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన తఫ్హీమ్ అనే యువకుడు తన కుటుంబానికి సమీప బంధువైన ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు.

ఈమె కుటుంబం హైదరాబాద్‌ పాతబస్తీలో నివాసం ఉంటోంది. ఓ రోజు ఆమెను కలిసి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను చెప్పాడు. అయితే ఇందుకు ఆ యువతి నిరాకరించింది.

తన ప్రేమను కాదనడంపై కక్ష పెంచుకున్న తఫ్హీమ్.. ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. యువతికి కొద్దిరోజుల క్రితం నిశ్చితార్ధం జరిగింది. దీనిని తట్టుకోలేని అతను...ఆ అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియాలో సంపాదించాడు.

వాటిని మార్ఫింగ్ చేసి యువతి తండ్రికి, కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపాడు. దీంతో నిశ్చితార్ధం రద్దయిపోయింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి చెందిన యువతి తండ్రి గుండెపోటుతో మరణించాడు. దీంతో బాధితురాలు గత నెల 3న సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.